కలం,స్పోర్ట్స్: ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్షిప్ (Asian U19 U23 Boxing Championships)లో భారత మహిళా బాక్సర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. జకార్తాలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లలో మన అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారు. ఏకంగా తొమ్మిది మంది బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి, దేశానికి పతకాలను ఖాయం చేశారు.
బుధవారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లతో ఈ విజయోత్సవం మొదలైంది. 51 కేజీల విభాగంలో తను, థాయిలాండ్‌కు చెందిన కెవాలిన్ నొరాసింగ్పై 5:0 తేడాతో ఏకపక్ష విజయం సాధించారు. ఆ తర్వాత 54 కేజీల విభాగంలో నిషా కూడా కజకిస్తాన్‌కు చెందిన అలియాక్సర్ సింబత్పై 5:0తో ఘన విజయం అందుకున్నారు. అయితే, 48 కేజీల విభాగంలో నిధి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కజకిస్తాన్‌కు చెందిన గుల్నాజ్ బురిబయేవా చేతిలో 3:2 తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్‌లలో కూడా భారత్ తన జోరును కొనసాగించింది. 57 కేజీల విభాగంలో ప్రాచి, కొరియా బాక్సర్ యెజిన్ ఓపై మొదటి రౌండ్లోనే ఆర్ఎస్సీ (RSC) ద్వారా విజయం సాధించారు. 60 కేజీల విభాగంలో నికితా చంద్, చైనీస్ తైపీకి చెందిన చెన్-క్సువాన్ యేపై మూడో రౌండ్లో ఆర్ఎస్సీ ద్వారా ఘన విజయం సాధించారు. అలాగే 65 కేజీల విభాగంలో కాజల్, జపాన్‌కు చెందిన అరిందా అకిమోటోపై 4:1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరారు.
ఈ విజయాలతో భారత్‌కు కనీసం తొమ్మిది పతకాలు రావడం ఖాయమైంది. సెమీఫైనల్‌కు చేరిన వారిలో తను (51 కేజీలు), నిషా (54 కేజీలు), ప్రాచి (57 కేజీలు), నికితా చంద్ (60 కేజీలు), కాజల్ (65 కేజీలు), శివాని (70 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), నైనా (80 కేజీలు), ప్రియాంక (+80 కేజీలు) ఉన్నారు.

