Mobile Popup Ad
Mobile Popup Ad

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌దే పైచేయి?

కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు (Commonwealth Games) కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జూలై 26 నుంచి 30 వరకు ఎస్‌ఈసీ ఆర్మడిల్లో వేదికగా జరగనున్నాయి. మొత్తం 11 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును భారత్ పంపిస్తోంది. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

అందరి దృష్టి ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానుపైనే ఉంది. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడనున్న ఆమెకు ఇది ప్రత్యేక టోర్నీ. 2014లో ఇదే గ్లాస్గోలో తొలి కామన్వెల్త్ పతకం గెలిచిన మీరాబాయి, 2018, 2022లో వరుసగా స్వర్ణాలు సాధించింది. ఇప్పుడు వరుసగా మూడో స్వర్ణం కోసం బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది భుజం గాయం నుంచి కోలుకున్న ఆమె ఇటీవల జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కూడా సత్తా చాటింది.

మహిళల 58 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి మరో ప్రధాన పతక ఆశగా నిలిచింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 55 కేజీల విభాగంలో రజతం గెలిచిన ఆమె, ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన 58 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. కొత్త బరువు విభాగానికి ఆమె విజయవంతంగా అలవాటు పడినట్లు ఇటీవల ప్రదర్శనలు చెబుతున్నాయి.

మహిళల 69 కేజీల విభాగంలో హర్జిందర్ కౌర్‌పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది. గత కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన ఆమె, ఈసారి ఒక విభాగం దిగువకు వచ్చి పోటీ పడుతోంది. కఠిన పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయగల సామర్థ్యం ఆమె సొంతం.

పురుషుల సూపర్ హెవీ వెయిట్ (+110 కేజీలు) విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ భారత ప్రధాన ఆశ. గత గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన అతడు, ఈసారి స్వర్ణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత ఏడాది కాలంగా తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.

అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఈసారి ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పురుషుల విభాగంలో రిషికాంత సింగ్ (60 కేజీలు), ఎం. రాజా (65 కేజీలు), అజయ బాబు (79 కేజీలు), దిల్‌బాగ్ సింగ్ (94 కేజీలు) తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ (53 కేజీలు), సంజన (77 కేజీలు), మార్టినా దేవి (+86 కేజీలు) కూడా జట్టులో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>