Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్డీఎస్ ను పరిశీలించిన బీఆర్‌ఎస్ బృందం

కలం, ​జోగులాంబ గద్వాల : రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (RDS) పరిధిలో తెలంగాణకు చెందాల్సిన తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టుల ద్వారా దోపిడీ చేస్తున్నాయని, వాటిని వెంటనే నిలిపివేయాలని బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు డిమాండ్ చేశారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆర్డీఎస్ ను బీఆర్ఎస్ బృందం బుధవారం పరిశీలించింది. ఈ‌ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రైట్ కెనాల్ నిర్మించడానికి ప్రయత్నిస్తోందని, దీనివల్ల ఆర్‌డీఎస్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కులను కోల్పోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు.

గతంలో ఆర్‌డీఎస్ రైతుల కష్టాలను స్వయంగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్న కేసీఆర్, నాడు ఇచ్చిన మాట ప్రకారం తుమిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ కోసం ఏపీ, కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులకు ఎన్‌వోసీలు ఇచ్చినట్లు తమకు నమ్మదగిన సమాచారం ఉందని నేతలు ఆరోపించారు. అసలు కొడంగల్ లిఫ్ట్ అనేది ఒక అనవసరమైన, పనికిరాని ప్రాజెక్ట్ అని, దానికోసం మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ హక్కులను పణంగా పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఆర్డీయస్ వద్ద ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, తక్షణమే ఒక మంత్రుల బృందాన్ని ఆర్‌డీఎస్ పరిశీలనకు పంపాలని, పాలమూరు హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. పాలమూరు గడ్డపై ఒక్క ఎకరా ఎండిపోయినా సహించేది లేదని స్పష్టం చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని నాయకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రాంమోహన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆంజనేయ గౌడ్, బీఅర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ బాసు హన్మంతు నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>