కలం, ఖమ్మం బ్యూరో: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని, సీతా రామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్ (Wyra Reservoir) కు తరలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద ఉన్న పంప్ హౌస్ లో నీటిపారుదల శాఖ అధికారులు మోటార్లను ఆన్ చేశారు. మోటార్లు ప్రారంభం కావడంతో గోదావరి జలాలు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ ప్రవాహం గురువారం మధ్యాహ్నం కల్లా వైరా రిజర్వాయర్‌కు చేరుకోనుందని అధికారులు స్పష్టం చేశారు. గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు చేరుతుండటంతో స్థానిక రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వరద నీటిని ఒడిసి పట్టి రిజర్వాయర్లను నింపడం ద్వారా రాబోయే రోజుల్లో సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు.

