కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియా యాక్టివిస్ట్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (Prashna Ravan) అరెస్టుపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. రావణ్‌కు వైసీపీ పార్టీ (YSRCP)కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రావణ్‌కు తామే డబ్బులిచ్చి పంపిస్తున్నామంటూ టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. టీడీపీ నేతలపై రావణ్ ఎక్కడా కేసులు పెట్టలేదని.. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణకు అనుకూలంగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. గతంలో జగన్‌పై రావణ్ విమర్శలు చేసినా.. తామెప్పుడూ ఇలా అణచివేసే ప్రయత్నం చేయలేదని అన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు.
జనసేనలా వ్యవహరించలేదు..
రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ వస్తున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించిన కొడాలి నాని.. రావణ్ వాస్తవానికి టీడీపీ పార్టీకి అనుకూలమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారని.. అందుకే ఎప్పుడూ టీడీపీ నేతల గురించి రావణ్ ఒక్క మాట కూడా మాట్లాడరని అన్నారు. టీడీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్, ఎల్లో మీడియా మాత్రమే అసత్య కథనాలతో రావణ్‌ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. జనసేన పార్టీలాగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి తాము దాడులకు ప్రయత్నించలేదని ఎద్దేవా చేశారు.
టీడీపీ బూడిద పార్టీ..
గత ఏడాది కాలంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని రావణ్ మాట్లాడటమే ప్రస్తుత ఆయన అరెస్టుకు అసలు కారణమని కొడాలి నాని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రావణ్‌పై వరుస కేసులు పెట్టిందని దుయ్యబట్టారు. తమకు నచ్చని వ్యక్తులను పోలీస్ స్టేషన్‌లలో పెట్టి తగలబెట్టించే సంస్కృతి టీడీపీది అని.. అందుకే ప్రజలు ఇప్పుడు టీడీపీని గొడ్డలి పార్టీ కాదు.. బూడిద పార్టీ అని పిలుచుకుంటున్నారని విమర్శించారు. తమది ప్రజల గుండెల్లో ఉన్న సంక్షేమ పార్టీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి కేవలం బూడిదనే మిగులుస్తారని అన్నారు.

