కలం, నాగర్ కర్నూల్ : తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (నివారణ) బిల్లు-2026పై పరిశీలన కోసం శాసనసభ స్పీకర్ సెలెక్ట్ కమిటీని నియమించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ ఛైర్మన్‌గా, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సభ్యులుగా నామినేట్ చేశారు. ఇందులో నాగర్ కర్నూల్ MLA డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) సభ్యుడిగా నియామకం అయ్యారు. ఈ కమిటీ 2026 వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు సభకు నివేదికను సమర్పించనుంది.
ఈ బిల్లును 2026 మార్చి 30 న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇవి మత, కుల, లింగం పరంగా విద్వేషాలు, అశాంతి కలిగిస్తున్నాయి. కాబట్టి వాటిని అడ్డుకోవడానికి, శిక్షించడానికి ఈ ప్రత్యేక చట్టం తెస్తున్నారు.
ఈ బిల్లు ప్రకారం…!
మాటల ద్వారా, రాతల ద్వారా, సైగల ద్వారా, డిజిటల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఒక వ్యక్తి.. ఓ గ్రూప్, కమ్యూనిటీ పట్ల ద్వేషం, అశాంతి, శత్రుత్వం కలిగించే ఉద్దేశ్యంతో చేసే భావాన్ని నియంత్రిస్తుంది. కాగా ఈ బిల్లు పట్ల ఆయా పార్టీల MLA లు అభ్యంతరాలు చెప్పడంతో దీనిని చైర్మన్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తుంది. వర్షాల సమావేశాల్లోపు కమిటీ బిల్లును పూర్తి స్థాయిలో సిద్ధం చేసి అసెంబ్లీ ముందుకు తీసుకొస్తుంది.
ఇదీ కమిటీ…!
మంత్రి పొన్నం ప్రభాకర్ ఛైర్మన్ సహా, 13 మంది అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఎంపికయ్యారు. ఇందులో ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, తోట లక్ష్మీకాంతారావు, గడ్డం మధుసూదన్ రెడ్డి(GMR), డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మామిడాల యశస్విని, దానం నాగేందర్, కోవా లక్ష్మీ, కొనేంటి మణిక్ రావు, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కునంనేని సాంబశివరావు సభ్యులుగా ఉన్నారు.
మంచి బిల్లు రూపొందించడమే లక్ష్యం: MLA డాక్టర్ రాజేష్ రెడ్డి
ప్రస్తుతం AI యుగంలో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ లో అసభ్య సమాచారం, దుష్ర్పచారం, కించపరచడం పెరుగుతుందని MLA డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు . మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను కూడా రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొస్తుందని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును కమిటీ తయారు చేస్తుందని చెప్పారు.

