Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్‌నినో ఎఫెక్ట్.. అన్నదాతల గుండెల్లో ‘కరువు’ దడ!

కలం, న్యూస్ నెట్వర్క్: సాధారణంగా జులై నెల వచ్చిందంటే చాలు.. వాన చినుకుల సవ్వడులు, అలుగుపోసే చెరువులు, పొలాల్లో గొర్రు తొక్కించే రైతులు, పాటలు పాడుతూ నాట్లు వేసే మహిళలతో పల్లెలు కళకళలాడుతుంటాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడి జాడ లేదు. మబ్బులు పట్టినట్టే పట్టి మాయమైపోతున్నాయి. ఎల్‌నినో (El Nino Effect) ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకుంటుండటంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని ‘కలం’ టీమ్ గ్రౌండ్ రియాల్టీ రిపోర్టులో వెల్లడైంది. వర్షాల రాకపోవడంతో ప్రస్తుతం దుక్కుల దగ్గరే వ్యవసాయ పనులు ఆగిపోవడంతో ‘ఈసారి బతుకు సాగుడెట్ల?’ అని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అడుగంటిన జలాలు.. ఎండిపోతున్న ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నిరుడు ఈపాటికి లక్ష ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కాగా, ఈసారి అది 30 వేల ఎకరాలు కూడా దాటలేదు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో పాత బోర్లు ఎండిపోయాయి. వెయ్యి అడుగులు వేసినా చుక్క నీరు పడటం లేదు. ప్రాజెక్టుల్లో సైతం నీళ్లు అడుగంటడంతో కాల్వల కింద ఆయకట్టు సాగు ఆశలు అడుగంటాయి. చేసేదేమీ లేక బోరుబావులపై ఆధారపడి వేసిన అరకొర నాట్లు, పత్తి మొలకలు సైతం ఎండ తీవ్రతకు, వేడి గాలులకు కళ్లముందే మాడిపోతున్నాయి. విత్తనాలు మొలకెత్తక ఇప్పటికే రెండు మూడు సార్లు విత్తిన రైతులు వేలాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు.

ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఇదీ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది ఇదే సమయానికి వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈసారి వర్షాలు ముఖం చాటేయడంతో చాలాచోట్ల నాట్లు మొదలు కాలేదు. ఎల్‌నినో ప్రభావం రైతుల్ని ఆందోళనలో పడేసింది. సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. కిన్నెరసాని నీరందే ప్రాంతాల్లోని రైతుల్లో కొంత ధైర్యం ఉన్నా జిల్లాలోని ఇతర మండలాల రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలనే నిబంధన విధింపు రైతులకు సవాలుగా మారింది. ఆయా రకాలతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు విత్తనాలు దొరుకుతున్నా యూరియా విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు.

వరంగల్ జిల్లాలో ఇలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ అనిశ్చితిలో పడింది. ఎల్‌నినో కారణంగా వర్షాల్లేక రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు. 10 ఎకరాల్లో పత్తి వేసే రైతులు ఈసారి 5 ఎకరాలకే పరిమితం చేసుకుంటున్నారు. కొందరు వరి సాగును పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారు. ఆల్టర్నేట్‌గా తక్కువ నీటి పంటలవైపు ఆలోచిస్తున్నారు. పత్తి, కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్షాభావ మండలాలను ప్రభుత్వం ప్రకటించి ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందించి పంట రుణాల రీ షెడ్యూలింగ్ చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

నల్లగొండ జిల్లా అన్నదాతల్లో అంతర్మథనం

భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి బోర్లు ఎండిపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ రైతులు రేపటి బతుకు ఎట్లా అని అంతర్మథనంలో పడ్డారు. ముఖ్యంగా కౌలు రైతులకు అత్యంత దయనీయమైన స్థితి నెలకొంది. పంట పండినా, పండకపోయినా భూమి యజమానికి కౌలు రైతులు వేలాది రూపాయల లీజు డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఎల్ నినో ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. ఇటు పెట్టుబడి పోయి, అటు కౌలు డబ్బులు కట్టలేక ఏం చేయాలో అర్థం కావడం లేదని.. తమలాంటి వారిని ప్రభుత్వమే అదుకోవాలని కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు ఛాయలు

ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన మహబూబ్‌నగర్ రైతులకు ‘ఎల్‌నినో’ రూపంలో నిరాశే ఎదురైంది. జూలై ఆరంభం నాటికి ఉమ్మడి జిల్లాలో వర్షపాతం లోటు దాదాపు -83%. కొన్ని చోట్ల ఇది -100%గా ఉంది. సాధారణంగా ఈ సమయానికే 70% విస్తీర్ణంలో విత్తనాలు పడతాయి. కానీ కేవలం 30% విస్తీర్ణంలోనే సాగు పనులు జరుగుతున్నాయి. పాలమూరు జిల్లాలో ప్రధాన పంట పత్తి. తొలకరి జల్లులు చూసి తొందరపడి విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వర్షం లేక మొలకలు వాడిపోతుంటే బాధపడుతున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పాలమూరు జిల్లాను ఒకప్పుడు ‘వలసల జిల్లా’ అని పిల్చుకునేవారు. ప్రాజెక్టుల రాకతో ఆ పరిస్థితి కొంత మారింది. కానీ, ఈ సీజన్‌లో పనులు లేకపోవడంతో కూలీలు మళ్లీ పట్టణాల బాట పడుతున్నారు.

మోటర్లపైన ఆధారపడ్డ మెదక్ రైతులు

ఉమ్మడి మెద‌క్ జిల్లా వ్యాప్తంగా ఆయ‌క‌ట్టు రైతులు వ‌ర్షాల‌పైన‌, బోర్లపైన ఆధార‌ప‌డుతున్నారు. కొన్ని ప్రాంతాలు ఘ‌న‌పురం ఆన‌క‌ట్ట మీద, సిద్దిపేట జిల్లాలో మ‌ల్లన్న సాగ‌ర్, కొండ‌పోచమ్మ సాగ‌ర్, రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రాజెక్టులపై ఆధారపడతారు. నీటి నిల్వలు అడుగంటడంతో కాల్వల ద్వారా అందే ఆయకట్టు సాగునీరు మీద ఆశల్లేవు. దీంతో రైతులు బోర్లపైనే ఆధారపడాల్సి వస్తున్నది. కానీ ‘కరెంటు ట్రిప్పవుతున్నది. లో-వోల్టేజి వస్తున్నది. ట్రాన్స్ పార్మర్లు కాలిపోతున్నయి. సొంత పైస‌ల‌తో బండి కిరాయి తీసుకొని రైతులు తీసుకువెళ్తున్నారు. నాణ్యమైన‌ క‌రెంటు స‌ర‌ఫ‌రా సక్రమంగా చేయాలి’ అని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో సగం కూడా సాగు కాలే..

తెలంగాణలోనే అన్నపూర్ణగా పేరు గాంచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు సకాలంలో లేక నాట్లు ఆలస్యమయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో ఈసారి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. బాన్సువాడ డివిజన్ ను మినహాయిస్తే నిజామాబాబ్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల్లో నాట్లు లేటు అయ్యాయి. ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం పెరగలేదు. శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద లేక వెలవెల బోతున్నాయి. భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోతున్నాయి. ఈసారి బోరు బావుల కింద కూడా నార్లు వేసేందుకు రైతులు ధైర్యం చేయడం లేదు. జూలై చివరి దాకా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా.. మరోవైపు పంటలు పండుతాయనే నమ్మకం రైతుల్లో కనిపించడం లేదు. గతసారి కంటే ఈసారి పంట విస్తీర్ణం తగ్గించుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఇదీ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వర్షాభావం అన్నదాతలను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఎల్‌నినో కారణంగా విత్తనాలు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ఇప్పటివరకు నమోదైన సాగు శాతం చాలా తక్కువగా ఉంది. కరీంనగర్ జిల్లాలో 5.25, పెద్దపల్లిలో 1.03, జగిత్యాలలో అత్యల్పంగా 0.57 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.52 శాతంగా మాత్రమే పంటలు సాగు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి, చెరుకు, సోయాబిన్, జొన్నలు, సజ్జలు, కందులు, పెసర్లు, వేరుశనగ వంటి పంటల వేసే ఆలోచ‌న చేస్తున్నారు. వర్షాలు లేక పంటలు పండకపోయినా కౌలు డబ్బులు యజమానులు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని కౌలు రైతులు వాపోతున్నారు. బోర్లు, బావుల కింద‌నే సాగు చేస్తుండ‌టంతో ఖ‌రీఫ్ లో ట్రాన్స్ ఫ‌ర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>