కలం, జనగామ: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి ఆర్జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి, భక్తుల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
ఆక్రమణలకు గురైన దేవాలయ భూములను వెంటనే రక్షించాలని, కలెక్టర్లతో సర్వే నిర్వహించి మార్కింగ్ చేయించాలని, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని జీడికల్, నవాబ్‌పేట, చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, మల్లికుదుర్ల దేవాలయాలకు రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.10 కోట్లు, రూ.2 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రతిపాదించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, కల్యాణ మండపాలు, అన్నదాన సత్రాలు, గెస్ట్ హౌస్‌లు, టాయిలెట్లు, కోనేరు అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు, పెండింగ్ పనుల పూర్తి వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

