కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని జిల్లా (Mahabubnagar) కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా అత్యంత ప్రాధాన్యతతో, వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (EROs), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (AEROs)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి కలెక్టర్ ఖుష్బూ గుప్తా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం తన ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా EROలు, AEROలతో ఇతర ఎలక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 99 శాతం ఎన్యూమరేషన్ ఫారం డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిందని, మిగిలిన వాటిని కూడ బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు త్వరితగతిన పంపిణీ చేయాలన్నారు.
నిర్ణీత గడువులోగా పూర్తిగా నింపిన ఫారాలను అవసరమైన వివరాలతో సేకరించాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తనకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి తప్పనిసరిగా BLOకు సమర్పించాలని, తద్వారా తప్పులు లేని, ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే రిసోర్స్ పర్సన్లు (RPs), వార్డ్ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి బూత్ లెవల్ అధికారులకు (BLOs) సహకరించాలన్నారు.
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు ఓటర్లకు ఫారాలు సక్రమంగా పూరించడంలో సహాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, ఓటర్లు పూరించిన ఫారాలను స్వయంగా సేకరించాలని స్పష్టం చేశారు.

