కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అయోధ్యలో (Ayodhya) మరో నిర్మాణ వైఫల్యం వెలుగులోకి వచ్చింది. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) కార్యాలయ భవనంలోని మెట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ ఉన్నవారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరిష్ త్రిపాఠి భవనంలోనే ఉన్నట్లు సమాచారం. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌లు, లైబ్రరీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆపరేటర్‌లు హాజరయ్యారు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మెట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటన సమయంలో మెట్లపై ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అయోధ్యలో చేపట్టిన పలు నిర్మాణ పనుల నాణ్యతపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా, తాజా ఘటనతో మరోసారి నిర్మాణాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి ఇదేనా?”, “ప్రజల డబ్బుతో నిర్మించిన భవనాల పరిస్థితి ఇలా ఉంటే ఎలా?” అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న అధికారులు, మెట్లు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

