కలం, వెబ్ డెస్క్: గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index) 2026 ర్యాంకింగ్స్‌లో భారత (India) పాస్‌పోర్ట్ 125వ స్థానంలో నిలిచింది. కేవలం వీసా రహిత ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే కాకుండా.. ఆయా దేశాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జీవన ప్రమాణాలు (క్వాలిటీ ఆఫ్ లైఫ్) వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ సంస్థ మొత్తం 200 దేశాలతో ఈ జాబితాను రూపొందించింది. సాధారణ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ లాగా కేవలం వీసా ఫ్రీ యాక్సెస్‌పైనే కాకుండా.. ఈ సూచీ అత్యంత సమగ్రమైన విధానాన్ని అనుసరించింది. ఇందులో ప్రయాణ సౌలభ్యానికి (మొబిలిటీ) 50 శాతం ప్రాధాన్యత ఇవ్వగా, మిగిలిన 50 శాతం పాయింట్లను పెట్టుబడి అవకాశాలు (25 శాతం), జీవన ప్రమాణాలకు (25 శాతం) సమానంగా కేటాయించింది.
భారత్‌కు మిశ్రమ ఫలితాలు
తాజా నివేదిక ప్రకారం.. భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం ర్యాంకింగ్స్‌లో ఇండియా 125వ స్థానంలో నిలవగా.. కేవలం ప్రయాణ సౌలభ్యం (మొబిలిటీ) పారామీటర్‌లో మరింత వెనుకబడి 135వ స్థానానికి పడిపోయింది. ఇక జీవన ప్రమాణాల విభాగంలో భారత్ 118వ స్థానాన్ని దక్కించుకుంది. కొన్ని రంగాలలో ఇండియా వృద్ధిని సాధిస్తున్నప్పటికీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అంతర్జాతీయంగా భారత పాస్‌పోర్ట్ అందించే ప్రయోజనాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.
‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ ర్యాంకింగ్స్‌లోనూ..
ఇటీవల విడుదలైన ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ (Henley Passport Index) ర్యాంకింగ్స్‌లోనూ ఇండియా స్వల్పంగా వెనుకబడింది. హెన్లీ సూచీలో భారత పాస్‌పోర్ట్ 80వ స్థానానికి చేరుకుంది. దీని ద్వారా భారతీయులకు 56 దేశాలకు వీసా రహిత (వీసా-ఫ్రీ) లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం లభిస్తున్నది. ఇందులో అత్యధికంగా ఆసియా, ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ దేశాలే ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్, ఐరోపా వంటి ప్రముఖ దేశాలకు వెళ్లాలంటే భారతీయులకు ఇప్పటికీ వీసా తప్పనిసరిగా ఉంది. ఈ ర్యాంకింగ్స్ కోసం వరల్డ్ బ్యాంక్ (ప్రపంచ బ్యాంకు), వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సేకరించిన 14 కీలక సూచీల ఆధారంగా డేటాను విశ్లేషించింది.
స్వీడన్ నంబర్ వన్!
2026 ఎడిషన్‌లో అంతర్జాతీయంగా యూరప్ దేశాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలోని అత్యుత్తమ టాప్-10 పాస్‌పోర్ట్‌లలో 9 స్థానాలను ఐరోపా దేశాలే కైవసం చేసుకున్నాయి. ఇందులో స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, డెన్మార్క్ (ఉమ్మడి స్థానం), నెదర్లాండ్స్ (ఉమ్మడి స్థానం), ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్), నార్వే
సింగపూర్ ఉన్నాయి.
3 విభాగాల్లో స్వీడన్ సత్తా
మూడు విభాగాల్లోనూ (మొబిలిటీ, ఇన్వెస్ట్‌మెంట్, జీవన ప్రమాణాలు) అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా స్వీడన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నది. స్వీడన్ ప్రయాణ సౌలభ్యంలో 11వ స్థానంలో, పెట్టుబడులలో 9వ స్థానంలో, జీవన ప్రమాణాలలో 2వ స్థానంలో నిలిచి ఓవరాల్‌గా నంబర్ వన్‌గా నిలిచింది. డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు ఉమ్మడిగా ఐదో స్థానాన్ని పంచుకున్నాయి. ప్రపంచంలో పాస్‌పోర్ట్ విలువ కేవలం సరిహద్దులు దాటడానికి మాత్రమే పరిమితం కాలేదని.. వేరే దేశాల్లో నివసించడానికి, పని చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవడానికి లభించే అవకాశాలకు ఇది ప్రతిరూపంగా మారుతున్నదని ఈ నివేదిక విశ్లేషించింది.

