కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. అన్బ్ ప్రాంతంలో జరిగిన నిరసనలు తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారిపైకి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహమ్మద్ యాకుబ్ అనే వ్యక్తి మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. టియర్ గ్యాస్ నిరంతరం ప్రయోగిస్తూనే ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది.
38 రకాల డిమాండ్లు..
కమ్యూనికేషన్ వ్యవస్థలపై నియంత్రణ తొలగించడం, ఆహార, ఔషధాల సరఫరాలకు అడ్డంకులు తొలగించడం, పీవోకేపై పాక్ ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగించడం వంటి 38 రకాల డిమాండ్లపై కొంతకాలంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ముజఫరాబాద్, రావల్ కోట్, మిర్పూర్, దడ్యాల్, డేరాకోట్, జీరో పాయింట్, తియాత్రి నోట్, సరోసా ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
భారీగా సైన్యం తరలింపు..
స్థానిక మీడియా చెబుతున్న ప్రకారం, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు పాకిస్థాన్ ప్రభుత్వం భారీగా సైన్యాన్ని పంపుతోంది. ఆందోళనకారులపైకి విచక్షణరహితంగా దాడులు, కాల్పులు చేస్తూ.. పదుల సంఖ్యలో నిరసనకారులను పొట్టన పెట్టుకుంటోందని సామాజిక ఉద్యమకారులు గగ్గోలు పెడుతున్నారు. పాక్ దమనకాండను ఎలాగైనా ఆపివేయించాలని కోరుతున్నారు.
కాగా, పీవోకేలో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. నిరాయుధులైన వారిపై పాక్ సైన్యం దాష్టీకాలను ప్రపంచం గమనించాలని ఇప్పటికే కోరింది. పాక్ ప్రభుత్వం పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేస్తోందని విదేశాంగ శాఖ ఇటీవలే విమర్శలు గుప్పించింది.

