Mobile Popup Ad
Mobile Popup Ad

వరుస ప్రమాదాలు.. రోడ్డెక్కని ఎలక్ట్రిక్ బస్సులు!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) రవాణా విభాగంలో ఎలక్ట్రిక్ బస్సుల (E Bus) సర్వీసులు వరుసగా 5వ రోజు నిలిచిపోయాయి. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, బ్యాటరీల్లో మంటలు చెల‌రేగుతుండ‌టంతో టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న అల్గునూర్ సమీపంలో ఒక బస్సు బ్యాటరీలో మంటలు వ్యాపించి పూర్తిగా దహనమైంది. జులై 1న కరీంనగర్-2 డిపోలో మరో బస్సు బ్యాటరీలో మంటలు చెలరేగి పాక్షికంగా ధ్వంసమైంది. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో బస్సులను డిపోలకే పరిమితం చేశారు.

సాంకేతిక తనిఖీలు:

ప్రస్తుతం కరీంనగర్-2 డిపోలోని ప్రతి బస్సునూ జేబీఎం సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా బ్యాటరీల పనితీరును పరిశీలిస్తూ, ప్రమాదాలకు గల అసలు కారణాలను విశ్లేషిస్తున్నారు. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేవని వంద శాతం నిర్ధారించుకున్న తర్వాతే ఈ బస్సులను తిరిగి రోడ్డెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో కరీంనగర్ 2 డిపోలో మొత్తం 104 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అందులో ఎక్స్‌ప్రెస్‌లు 50, సూపర్ లగ్జరీలు 40, డీలక్స్‌లు 10, డిపోలో అదనపు బస్సులు 4 ఉన్నాయి. అయితే జిల్లా పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 3.50 లక్షల కిలో మీటర్లకు పైగా ప్రయాణించడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రేపు కీలక వర్చువల్ సమావేశం

బస్సుల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీఈఎస్‌ఎల్ (కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్) సంస్థకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఈఎస్‌ఎల్ ఆధ్వర్యంలో ఆర్టీసీ, జేబీఎం ప్రతినిధులతో ఒక జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం తర్వాతే కరీంనగర్-2 డిపోకు చెందిన విద్యుత్ బస్సులను ఎప్పుడు తిరిగి ప్రారంభించాలనే దానిపై ఒక స్పష్టత రానుంది.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇతర డిపోల నుంచి దాదాపు 29 సాధారణ బస్సులను రప్పించారు. వీకెండ్ కావడం, సోమవారం కూడా ఆఫీసులు, కాలేజీల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. జేబీఎస్ (JBS) రూట్లతో పాటు రద్దీగా ఉండే ఇతర ముఖ్యమైన మార్గాల్లో అదనపు ట్రిప్పులను నడపడానికి ఆర్టీసీ వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

ప్రతి బస్సును పరిశీలిస్తున్నాం: శ్రీనివాస్, రెండో డిపో మేనేజర్

డిపోలో 104 ఎలక్ట్రిక్‌ బస్సులున్నాయి. ఇక్కడి పరిధిలోని బస్సులు 3.50 లక్షల కిలోమీటర్లు పైగా ప్రయాణించడంతో ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ప్రస్తుతం డిపో పరిధిలోనే ఉన్నాయి. జేబీఏం సంస్థ నుంచి నివేదిక ద్వారా ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>