కలం , మహబూబ్ నగర్ బ్యూరో: విద్యావ్యవస్థలో మార్పులతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. నోయిడాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక TEDx అంతర్జాతీయ వేదికపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన వక్తగా పాల్గొని, విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుల అవసరాన్ని బలంగా ప్రతిపాదించారు. సమాజం నిజమైన అభివృద్ధి దిశగా పయనించాలంటే విద్యలో నాణ్యత, సమాన అవకాశాలు, ఆధునిక సాంకేతికత అనుసంధానం అత్యవసరమని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే సమాజ వికాసం సాధ్యమవుతుందని, విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా దేశ అభివృద్ధికి కూడా కీలకమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. TEDx వంటి అంతర్జాతీయ వేదికపై మాట్లాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగంలో తీసుకువస్తున్న వినూత్న మార్పులను ప్రపంచానికి పరిచయం చేశారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు, డిజిటల్ లెర్నింగ్ విస్తరణ, డిజిటల్ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించడం వంటి అంశాలను విశదీకరించారు.
“మై విలేజ్ స్కూల్” కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ, గ్రామీణ విద్యను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతోందని అన్నారు. అదేవిధంగా QR కోడ్ డిజిటల్ లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునే విధంగా పాఠ్యసామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సామాజిక అసమానతలను తగ్గించవచ్చని, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారిని గ్లోబల్ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. సాధారణంగా మేధావులు, పరిశోధకులు, అవార్డు గ్రహీతలు మాత్రమే పాల్గొనే TEDx వేదికపై ఒక ప్రజాప్రతినిధికి అవకాశం లభించడం అరుదైన విషయం. ఈ నేపథ్యంలో యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం రావడం మహబూబ్ నగర్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆయన ప్రసంగాన్ని అభినందిస్తూ, విద్యా సంస్కరణలపై ఆయన చూపిస్తున్న దృఢ సంకల్పం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

