కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) కు కేంద్రం ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా బాలల లైంగిక దోపిడి కంటెంట్‌ను (CSEAM) ప్రోత్సాహించేలా వస్తున్న ప్రకటనలు, అభ్యంతరకర పోస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించింది. చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ‘మెటా’ కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
అసలు ఇలాంటి అక్రమ ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై ఎలా అనుమతించబడ్డాయో చెప్పాలని కేంద్రం డిమాండ్ చేసింది. దీనిపై తదుపరి 7 రోజుల్లోగా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని మెటా సంస్థకు అల్టిమేటం ఇచ్చింది. నిర్దేశించిన గడువులోగా మెటా యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోతే, ఐటీ చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం ఉక్కుపాదం
గతకొంతకాలంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం వరుస యాక్షన్లతో విరుచుకుపడుతోంది. వాట్సాప్‌లో ‘యూజర్ నేమ్ ఫీచర్’ తీసుకురావాలని చూసిన మెటా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. దీనివల్ల సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరిగే ఛాన్స్ ఉందని మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అలాగే పైరసీ సినిమాలు, అశ్లీల ఓటీటీ కంటెంట్ ను యథేచ్చగా షేర్ చేయడంపై టెలిగ్రామ్‌కు కూడా నోటీసులు పంపింది. తాజాగా చిన్నారుల భద్రతకు భంగం కలిగించే కంటెంట్‌పై ఇన్‌స్టాకు (Instagram) అల్టిమేటం జారీ చేసింది.
Read Also: టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 తప్పులు చేస్తే ప్రమాదమే!
Follow Us On : WhatsApp

