కలం, నిర్మల్: భారతదేశం త్వరలోనే ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే విశ్వగురువుగా అవతరిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కె. జయదేవ్ అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గురుపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా స్వయం సేవకులు తమ శక్తికొలది స్వచ్ఛందంగా గురుదక్షిణ సమర్పించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న జయదేవ్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ సమయంలో వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌ను గురువుగా నియమించాలని స్వయం సేవకులు కోరగా, వ్యక్తికంటే వ్యవస్థ, సనాతన ధర్మం, దేశం గొప్పవని పేర్కొంటూ కాషాయ ధ్వజాన్నే అత్యున్నత గురువుగా నిర్ణయించారని వివరించారు.
ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిన దేశం భారతదేశమేనని పేర్కొన్న ఆయన, దేశం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని మరింత సంఘటితం చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో దేశంలోని ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబైన్డ్ ఆటోమోటివ్ జనరల్ మేనేజర్ నార్లాపురం నితీష్ కుమార్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, నగర సంఘచాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి, స్వయం సేవకులు పాల్గొన్నారు.
Read Also: మెటాకు కేంద్రం బిగ్ షాక్… ఇన్‌స్టాలో ఆ కంటెంట్ పై నోటీసులు
Follow Us On : WhatsApp

