కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. షోపియాన్ జిల్లా చాన్పొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన నిఘా వర్గాలు భద్రత బలగాలను అప్రమత్తం చేశాయి. దీంతో సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ చేస్తుండగా.. ఇద్దరు ముష్కరులను గుర్తించి జవాన్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించారు. మరో ఉగ్రవాది కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
భద్రత బలగాలను కవ్వించేందుకే..
మరణించిన ఇద్దరు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను జకీర్ గనాయ్, లతీఫ్ భట్‌గా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భద్రతా బలగాలను కవ్వించేందుకే ముష్కరులు చొరబడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. యాత్రకు వెళ్లే భక్తులకు భారీ భద్రత కల్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతపై సైన్యాధికారులతో తరచూ సమీక్ష చేస్తున్నారు.

