కలం, వెబ్ డెస్క్: ఆర్మీ ఆఫీసర్ (Army Officer) కావాలి.. దేశ సేవ చేయాలనేది ఆ యువకుడి చిన్ననాటి కల. తనను తాను ఆర్మీ దుస్తుల్లో తప్ప మరోలా ఊహించుకోలేకపోయాడు. అందుకోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. పుస్తకాలతో యుద్ధం చేశాడు. ఓటమి పలకరించిన ప్రతీసారి.. నిరుత్సాహపడకుండా.. పట్టువదలని విక్రమార్కుడిలా అహోరాత్రులు శ్రమించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. కుటుంబసభ్యులే కాదు, రాష్ట్ర సీఎం కూడా పొంగిపోయారు. అతడే ప్రీతమ్ సింగ్ బగేడియా.
పదో తరగతి పూర్తి కాగానే..
రాజస్థాన్లోని జాలోర్ పట్టణానికి చెందిన ప్రీతమ్ సింగ్ బగేడియాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 2018లో పదో తరగతి పూర్తి చేసిన ప్రీతమ్.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే కలతో పై చదువుల కోసం జైపుర్ వెళ్లాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలకు పలుమార్లు ప్రయత్నించాడు. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేకపోయాడు. నాలుగో ప్రయత్నంలో పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినా.. అత్యంత కీలకమైన ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
తండ్రి ప్రోత్సాహంతో..
నాలుగేళ్లలో నాలుగు సార్లు విఫలమైనా ప్రీతమ్ ప్రిపరేషన్ మాత్రం ఆపలేదు. తండ్రి మహేంద్ర సింగ్, కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. కఠోర క్రమశిక్షణ, ఓపికగా మళ్లీ చదవడం ప్రారంభించాడు. అయిదు, ఆరో ప్రయత్నాల్లో కూడా మళ్లీ ఓటమే పలకరించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో మరొకరు ప్రిపరేషన్ వదిలేసి, పై చదువులు, ఉద్యోగం చూసుకోవడం సహజం. కానీ, ప్రీతమ్కు ఆర్మీ డ్రెస్ వేసుకోవాలనే కల ఏకాగ్రతను చెక్కు చెదరనివ్వలేదు.
ఏడో ప్రయత్నంలో..
అప్పటికే ఆరు సార్లు ప్రయత్నించినా ఓటమి పాలైన ప్రీతమ్.. ఏడో సారి మాత్రం ఎలాంటి తప్పులు చేయలేదు. చేసిన తప్పులను సమీక్షించుకున్నాడు. ఎక్కడ మిస్టేక్ అవుతుందో.. తెలుసుకున్నాడు. ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాడు. శక్తిని కూడదీసుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష రాశాడు. పరీక్ష ఫలితాలు చూసి ప్రీతమ్ కంటనీరు పెట్టుకున్నాడు. ఆలిండియా 41వ ర్యాంక్ సాధించాడు. అప్పటి వరకు ఆ పట్టణంలో అనామకుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు లెఫ్టినెంట్ ప్రీతమ్ సింగ్ బగేడియా అయిపోయాడు.
అకాడమీలో అతడే ఫస్ట్..
డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందిన ప్రీతమ్.. అన్ని విభాగాల్లో సత్తా చాటా ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బెస్ట్ ట్రైనీ ఆఫీసర్ అవార్డు కూడా అందుకున్నాడు. సీఎం పుష్కర్ సింగ్ ధామి అతడిని ప్రశంసించాడు. ఎన్ని ఓటములు ఎదురైనా.. కసితో కష్టపడి ఆర్మీ ఆఫీసర్ అయిన ప్రీతమ్ జాలోర్ పట్టణంలోనే మొదటి సైన్యాధికారి కావడం గమనార్హం.

