కలం, వెబ్ డెస్క్: ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను నాలుగు గంటల పాటు ఎర్రటి ఎండలో నిల్చొబెట్టారని, కేసీఆర్‌ను ఉరి తీసినా తక్కువే అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. బతుకమ్మ చీరలను కూడా వదలకుండా దోచుకున్న దుర్మార్గుడు.. నీచుడు.. అంటూ ధ్వజమెత్తారు.
నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్ (Midjil) బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తట్టపనికి, పార పనికి పాలమూరు బిడ్డలు కావాలి.. పరిపాలనకు మాత్రం వద్దా.. అని ప్రశ్నించారు. అహంకారానికి కూడా హద్దు ఉంటుందని, దొరలకు గ్రామాల్లో సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
తెలంగాణకు అప్పులు.. కేసీఆర్‌కు ఆస్తులు..
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు ఆస్తులు సంపాదించుకుని, తెలంగాణకు రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఫాంహౌస్‌లు ఉన్నాయని ఆరోపించారు.
భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లను విన్న కేసీఆర్‌ది ఒక బతుకేనా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫోన్లు వినేందుకేనా మళ్లా అధికారంలోకి రావాలి.. అని ప్రశ్నించారు. అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్లు గొలుసులతో ఫాంహౌస్‌లో కట్టేశారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ కోసం సమిధను అవుతా..
దేశం కోసం గత 35 ఏళ్లుగా అధికారం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దూరంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకోసం తాను సమిధను కూడా అవుతానన్నారు. తనకు సీఎం బాధ్యత అప్పగించిన సోనియా, రాహుల్ గాంధీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలన్నారు. 2029 ఎన్నికల్లో తనతో నడిచి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు. అందుకోసం మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: మోదీని చంపేస్తాం.. ఆ దేశం నుంచి బెదిరింపులు!
Follow Us On : WhatsApp

