కలం, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) రౌండ్ ఆఫ్ 32లో కేప్ వెర్డేపై 3-2తో విజయం సాధించిన అర్జెంటీనా తదుపరి దశకు చేరుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మయామిలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే (Cape Verde) ఆటగాళ్లు మెస్సీపై కఠినంగా ఆడారు. అయినప్పటికీ ఫైనల్ విజిల్ తర్వాత అదే జట్టు ఆటగాళ్లు మెస్సీ వద్దకు వచ్చి సెల్ఫీలు, జెర్సీలు కోరారు. మెస్సీ కూడా వారికి చిరునవ్వుతో సహకరించారు.
ఆ తర్వాత స్పందించిన మెస్సీ (Lionel Messi).. మైదానంలో తనను బలంగా తన్నిన ఆటగాళ్లే మ్యాచ్ పూర్తయ్యాక జెర్సీ, ఫొటోలు అడిగారని సరదాగా వ్యాఖ్యానించారు. మ్యాచ్ గురించి మాట్లాడిన మెస్సీ.. కేప్ వెర్డే చాలా బలంగా పోరాడిందని చెప్పారు. ఈ మ్యాచ్ సులభంగా ఉండదని ముందే తెలుసని, ప్రత్యర్థి జట్టు ఇప్పటికే ఈ టోర్నీలో తమ సత్తా చాటిందని పేర్కొన్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో సెట్ పీస్‌లను తమ జట్టు సమర్థంగా ఉపయోగించుకుందని చెప్పారు.
గత కొన్ని వారాలుగా ఆ అంశంపై ప్రత్యేకంగా సాధన చేస్తున్నామని, అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడం నాకౌట్ మ్యాచ్‌ల్లో చాలా కీలకమని వివరించారు. గాల్లో బంతిని బాగా ఆడగల ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని, ఈ మ్యాచ్‌లో అది ఉపయోగపడిందని తెలిపారు. దాడిలోనే కాకుండా రక్షణలో కూడా ఈ అంశంపై సాధన కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే విజయం సాధించినప్పటికీ తమ జట్టు ఆటపై పూర్తిగా సంతృప్తి లేదని మెస్సీ వెల్లడించారు.
తొలి గోల్ చేసిన తర్వాత ఆటపై పట్టు సాధిస్తామని అనుకున్నప్పటికీ, అందుకు విరుద్ధంగా బంతిపై నియంత్రణ కోల్పోయామని చెప్పారు. ప్రత్యర్థిపై సమర్థంగా ఒత్తిడి తీసుకురాలేకపోయామని కూడా పేర్కొన్నారు. చివరకు కేప్ వెర్డే నుంచి వచ్చిన గట్టి సవాల్‌ను అధిగమించి అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. అయితే ముందున్న నాకౌట్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని జట్టు ఆటలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని మెస్సీ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
Read Also: మోదీని చంపేస్తాం.. ఆ దేశం నుంచి బెదిరింపులు!
Follow Us On : WhatsApp

