కలం, ఖమ్మం బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె. అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలోని పలు డివిజన్లు, మార్కెట్ ఏరియా, అంబేద్కర్ సెంటర్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించి, ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ, SIR ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. కుటుంబ వివరాల అనుసంధానం, ముసాయిదా ఓటరు జాబితా పరిశీలన, క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిర్దేశిత గడువులోగా సరిదిద్దుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అహ్మద్ పిలుపునిచ్చారు.

