కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాటి కాలంలో తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంకెళ్ళ నుంచి బంధవిముక్తి చేసేందుకు దొడ్డి కొమురయ్య పోరాటాలు చేశారని గుర్తుచేశారు.
ఎంతో తెగువతో నిజాం నిరంకుశత్వాన్ని, దొరల ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అని తెలిపారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను అందరూ కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, పలువురు సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

