కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని అప్పుల (Telangana Debt) గురించి ప్రధాన చర్చ జరిగింది. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే అన్నింటికంటే మెయిన్ టాపిక్‌గా మారిపోయింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య అప్పులపై వాడివేడి చర్చ జరుగుతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు హీట్ పుట్టిస్తున్నాయి.
అప్పులపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తలా ఒక లెక్క చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు కూడా తలో లెక్క చెప్తున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎంత అప్పు చేసిందనేది ఆర్థిక శాఖ దగ్గర పక్కా లెక్కలున్నాయి. అది బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లకు తెలియనిదేమీ కాదు. అయినా ఎవరి లెక్క వారిదే! ఒకరు పూర్తిస్థాయి లెక్కలు చెప్తుంటే మరొకరు ఉద్దేశపూర్వకంగా కొన్నింటిని దాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అన్నీ కలిపి రూ. 8.21 లక్షల కోట్లు: భట్టి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అసెంబ్లీలో దీనిపై లోతుగా చర్చ జరిగింది. ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందులో పేర్కొన్న ప్రకారం మొత్తం అప్పు రూ. 6,71,757 కోట్లు. ఇందులో రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోని రుణాలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు, ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న రుణాలు, సొంతంగా కార్పొరేషన్లు వాటి పూచీకత్తుతో తీసుకున్న నాన్-గ్యారంటీ లోన్లు కూడా ఉన్నాయి. ఏయే కార్పొరేషన్ ఎంత రుణం తీసుకున్నదీ లెక్కలు చెప్పారు. ఏ సంవత్సరం ఎంత రుణం తీసుకున్నది, దానికి చెల్లించాల్సిన వడ్డీ, మొత్తం రుణాల్లో బడ్జెట్‌తో సంబంధం లేకుండా తీసుకున్నదెంత.. వీటన్నింటి లెక్కలు చెప్పారు.
కానీ ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్ల పెండింగ్, మెడికల్ బిల్లుల బకాయిలు, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించనివి.. వీటిని పేర్కొనలేదు. వీటన్నింటినీ కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 8,21,651 కోట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు : (కోట్ల రూ.లలో)
ఆర్బీఐ నుంచి తీసుకున్నది: 3,89,673
కార్పొరేషన్లు తీసుకున్నది : 1,27,208
ప్రభుత్వ గ్యారంటీ రుణాలు : 95,462
నాన్-గ్యారంటీడ్ లోన్లు : 59,414
పెండింగ్ బిల్లులు : 40,154
డిస్కంలు, సింగరేణికి బకాయిలు : 1,09,740
మొత్తం : 8,21,651
రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం అప్పు : 90,161
గత బీఆర్ఎస్ సర్కార్ చేసింది : 7,31,490
రూ. 4.17 లక్షల కోట్లే : హరీశ్‌రావు
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని అప్పు భారం కేవలం రూ. 4.17 లక్షల కోట్లేనని నాటి ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు, ప్రభుత్వమే గ్యారంటీగా చెల్లించాల్సిన రుణాలు.. ఇవన్నీ కలిపే ఉన్నాయని తాజాగా మంత్రి జూపల్లికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వైట్ పేపర్ సమర్పించిన తర్వాత జరిగిన చర్చలో ఇదే విషయాన్ని చెప్పానని, ఆ లెక్కలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని, ఎక్కడ చర్చ పెట్టినా వివరించడానికి సిద్ధమని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పే అప్పుల లెక్కలే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయని, అసెంబ్లీలో సీఎం చెప్పిన లెక్కలు, ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్తున్న లెక్కలు, మంత్రి జూపల్లి వెల్లడించిన గణాంకాలకు పొంతన లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలోని మొత్తం అప్పులు రూ. 4.17 లక్షల కోట్లు దాటలేదని, ప్రభుత్వం చెప్తున్నట్లుగా రూ. 8.21 లక్షల కోట్లు కాదని హరీశ్ తెలిపారు.
మేం చేసిన అప్పు 3.50 లక్షల కోట్లే: కేటీఆర్
బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్తున్న లెక్క ఒకలాగ ఉంటే అదే పార్టీకి చెందిన కేటీఆర్ చెప్తున్న లెక్క మరోలా ఉంది. లోక్‌సభ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2025 ఆగస్టు 11న రాతపూర్వకంగానే అప్పులపై వివరణ ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన మొత్తం అప్పు రూ. 3.50 లక్షల కోట్లు మాత్రమేనని ఆ కాపీని కేటీఆర్ ప్రస్తావించారు. కానీ, ఇందులో ఎఫ్ఆర్‌బీఎం, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే ఉన్నాయి. బడ్జెటేతర (ఆఫ్ బడ్జెట్) రుణాలు, కార్పొరేషన్లు సొంత గ్యారంటీపై తీసుకున్న (నాన్-గ్యారంటీడ్) రుణాలు.. ఇలాంటివేవీ అందులో కేంద్రం ప్రస్తావించలేదు.
బీఆర్ఎస్ హయాంలోని మొత్తం అప్పు రూ. 3.50 లక్షల కోట్లేనని కేటీఆర్ అంటుండగా.. హరీశ్‌రావు మాత్రం ఇది రూ. 4.17 లక్షల కోట్లు అని ప్రస్తావించడంతో బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లేదనే విమర్శలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వివిధ రూపాల్లో చేసిన అప్పులను ఈ ఇద్దరూ దాచిపెడుతున్నారన్న ఆరోపణలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.
కేటీఆర్ చెప్తున్న లెక్క : (కోట్ల రూ.లలో)
ఆర్బీఐ నుంచి తీసుకున్నది : 3,14,545
కేంద్రం నుంచి తీసుకున్నది : 18,057
అటానమస్ సంస్థల నుంచి : 13,194
చేబదుళ్ల బకాయిలు : 999
స్పెషల్ సెక్యూరిటీలు : 4,723
మొత్తం : 3,50,520
ఆర్బీఐ చెప్తున్నదేమిటి?
అన్ని రాష్ట్రాలు తీసుకున్న రుణాలను, కేంద్రం నుంచి తీసుకున్న అప్పును (స్టేట్ ఫైనాన్స్) రిజర్వు బ్యాంకు ప్రతీ సంవత్సరం నివేదికలో వెల్లడిస్తుంది. ఆ ప్రకారం 2024 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పు (ఔట్ స్టాండింగ్ లయబిలిటీస్) రూ. 3,95,054 కోట్లు అని స్పష్టం చేసింది. ఇందులో ఆర్బీఐ ద్వారా తీసుకున్నది రూ. 3,32,463 కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్నది రూ. 9,374 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి తీసుకున్నది రూ. 16,861 కోట్లు, రిజర్వు ఫండ్ నుంచి వాడుకున్నది రూ. 4,195 కోట్లు, డిపాజిట్లు-అడ్వాన్సుల రూపంలో రుణం రూ. 32,110 కోట్లు.. అని బ్రేకప్ డీటెయిల్స్ వెల్లడించింది.
ఆర్బీఐ లెక్క : (కోట్ల రూ.లలో)
మార్కెట్ బారోయింగ్స్ : 3,14,545
‘ఉదయ్’ నుంచి : 7,138
స్పెషల్ సెక్యూరిటీలు : 4,723
నాబార్డ్ నుంచి : 5,447
కేంద్రం నుంచి : 9,374
ప్రావిడెంట్ ఫండ్ నుంచి : 16,861
రిజర్వు ఫండ్ నుంచి : 4,195
డిపాజిట్-అడ్వాన్సుల నుంచి : 32,110
ఇతరాలు: 661
మొత్తం : 3,95,054
ఆర్బీఐ చెప్పనిదేమిటీ?
అయితే బడ్జెటేతర రుణాల ఆర్బీఐ పరిధిలోకి రాకపోవడంతో వాటి గురించి ఆర్బీఐ ప్రస్తావించలేదు. బడ్జెటేతర రుణాల్లో కాళేశ్వరం కార్పొరేషన్ తరఫున తీసుకున్న రూ. 94,572 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున తీసుకున్న రూ. 27,838 కోట్లు.. ఇలాంటివి మొత్తం రూ. 1,27,208 కోట్లు ఆర్బీఐ లెక్కల్లో లేవు.
మొత్తానికి బడ్జెట్ పరిధిలోని అప్పులు, బడ్జెటేతర రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలు, పెండింగ్ బిల్లులను ఒక్కొక్కరు ఒక్కొలా పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ లెక్కల తేడాలు వస్తున్నాయి. ఈ పొలిటికల్ ‘క్రెడిట్ వార్’ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

