కలం, స్పోర్ట్స్: రెండు గేమ్‌లు వరుసగా చేజారాయి.. మ్యాచ్ కూడా చేతిలో నుంచి జారిపోతున్నట్టే కనిపించింది. కానీ తన్వీ ఖన్నా (Tanvi Khanna) అసలు పోరాటాన్ని అప్పుడే మొదలుపెట్టింది. అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో ఈజిప్ట్ క్రీడాకారిణి ఫరీదా వాలిద్‌ను ఓడించి ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ పీఎస్‌ఏ ఛాలెంజర్ స్క్వాష్ టోర్నీ మహిళల టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబైలోని జూహూ విలే పార్లే జింఖానా క్లబ్‌లో జరిగిన మహిళల ఫైనల్లో మూడో సీడ్ తన్వీ ఖన్నా.. రెండో సీడ్ ఫరీదా వాలిద్‌పై 8-11, 2-11, 12-10, 11-9, 11-7 తేడాతో విజయం సాధించింది.
45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి రెండు గేమ్‌లను కోల్పోయిన తన్వీ.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది. ఈ విజయంతో ఈ ఏడాది జనవరిలో ఫరీదా చేతిలో ఎదురైన ఓటమికి కూడా ప్రతీకారం తీర్చుకుంది. మూడో గేమ్‌లో 4-8తో వెనుకబడిన దశలో తన్వీ అసాధారణ పోరాటం చేసింది. వరుస పాయింట్లతో స్కోరును సమం చేసి ఆ గేమ్‌ను దక్కించుకుంది. నాలుగో గేమ్‌లో కూడా ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె, చివరి గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాన్ని ఖాయం చేసింది.
మ్యాచ్ అనంతరం తన్వీ మాట్లాడుతూ, ప్రారంభంలో ఎక్కువగా విజేత షాట్లు ఆడాలని ప్రయత్నించడం వల్ల తప్పిదాలు జరిగాయని తెలిపింది. అయితే తన సహజ ఆటనే కొనసాగించాలని కోచ్ సూచించడంతో దీర్ఘ ర్యాలీల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందని, అదే విజయానికి కారణమైందని వెల్లడించింది. పురుషుల ఫైనల్లో ఎం. స్యాఫిక్ కమాల్ కూడా ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్‌కు చెందిన యాసిన్ షోహ్డీపై 3-2తో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

