కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ (Karimnagar Cooperative Urban Bank) ఎన్నికల వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇటీవల నిర్వహించిన బ్యాంక్ ఎన్నికల ఫలితాల అమలుపై వరంగల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ స్టే విధిస్తూ సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటరు జాబితా తయారీలో నిబంధనలను తుంగలో తొక్కారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓటరు జాబితాపై తీవ్ర అభ్యంతరం
నిబంధనల ప్రకారం జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకాని సభ్యులకు ఓటు హక్కు కల్పించడంపై ట్రిబ్యునల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటరు జాబితా రూపకల్పనలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అమలును నిలిపివేస్తూనే.. గడ్డం విలాస్ రెడ్డి నేతృత్వంలోని పాత కమిటీని (పీఐసీ) తాత్కాలికంగా కొనసాగాలని ఆదేశించింది. అయితే, ఈ కమిటీ కేవలం రోజువారీ పరిపాలనా, ఆర్థిక వ్యవహారాలను మాత్రమే చూసుకోవాలని, ఎలాంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టమైన గైడ్‌లైన్స్ విధించింది.
ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓటరు జాబితా, నోటిఫికేషన్, నామినేషన్ పత్రాలు, బ్యాలెట్ పేపర్లతో సహా అన్ని రకాల రికార్డులను అత్యంత భద్రంగా ఉంచాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, వివరణతో కూడిన నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలంటూ జిల్లా సహకార అధికారి (DCO), ఎన్నికల అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ గడ్డం విలాస్ రెడ్డి, అలుగు విద్యాసాగర్, మంగి రవీందర్ లు కోఆపరేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పరిణామాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

