హులెన్‌కోర్ట్ ఉమెన్స్ ఓపెన్‌లో భారత స్టార్ సంచలనం

కలం, స్పోర్ట్స్ : హులెన్‌కోర్ట్ ఉమెన్స్ ఓపెన్‌లో (Hulencourt Womens Open 2026) భారత స్టార్ గోల్ఫర్ దీక్షా డాగర్ (Diksha Dagar) అద్భుత ప్రదర్శనతో టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది. తొలి రౌండ్‌లో ఒక్క బోగీ కూడా నమోదు చేయకుండా నాలుగు అండర్ 68 స్కోర్ చేసి సంయుక్త అగ్రస్థానంలో నిలిచింది. నిలకడైన ఆటతీరుతో టైటిల్ పోరులో బలమైన సందేశం పంపింది. ఉదయం సెషన్‌లో బరిలోకి దిగిన దీక్షా తొలి, ఆరో, 10వ, 14వ హోల్స్‌లో బర్డీలు నమోదు చేసింది. కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అద్భుతంగా ఆడింది. గ్రీన్స్‌ను అంచనా వేయడం సవాలుగా ఉన్నప్పటికీ, బంతి వేగాన్ని సమర్థంగా నియంత్రించడంతో మంచి ఫలితం వచ్చిందని మ్యాచ్ అనంతరం ఆమె తెలిపింది. ప్రస్తుతం తన ఆటపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది.

ఇటీవల లేడీస్ యూరోపియన్ టూర్‌లో వరుసగా నాలుగు టాప్-20 ఫినిష్‌లు సాధించిన దీక్షా మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. రెండు వారాల క్రితం జరిగిన డచ్ లేడీస్ ఓపెన్‌లో కూడా ఆమె సంయుక్త మూడో స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. భారత్‌కు చెందిన మరో ప్రముఖ గోల్ఫర్ ఆదితి అశోక్ కూడా శుభారంభం చేసింది. రెండు అండర్ 70 స్కోర్‌తో సంయుక్త ఏడో స్థానంలో నిలిచి అగ్రస్థానానికి కేవలం రెండు షాట్ల దూరంలో ఉంది.

ఇక అవని ప్రశాంత్ తొలి 11 హోల్స్‌లో మూడు ఓవర్లకు చేరుకున్నప్పటికీ, చివరి నాలుగు హోల్స్‌లో మూడు బర్డీలు నమోదు చేసి ఈవెన్ పార్ 72తో సంయుక్త 24వ స్థానంలో నిలిచింది. ప్రణవి ఉర్స్ ఒక ఓవర్ 73 స్కోర్‌తో సంయుక్త 33వ స్థానంలో కొనసాగుతోంది. దీక్షాతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన నాడియా వాన్ డెర్ వెస్ట్‌హుయిజన్, స్విట్జర్లాండ్ గోల్ఫర్ మోర్గాన్ మెట్రాక్స్, ఇంగ్లండ్‌కు చెందిన బ్రోంటే లా కూడా నాలుగు అండర్ స్కోర్‌తో సంయుక్త అగ్రస్థానంలో నిలిచారు. తొలి రౌండ్‌లో భారత గోల్ఫర్‌లు మెరుగైన ప్రదర్శన చేయడంతో రెండో రౌండ్‌పై అభిమానులలో  ఆసక్తి మరింత పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>