కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతా రామచంద్రస్వామి వారి క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆలయ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది జూన్ నెలలో 2,43,549 మంది భక్తులు రామయ్యను దర్శించుకోగా, ఈ ఏడాది జూన్ నెలలో ఆ సంఖ్య ఏకంగా 2,69,781 కి చేరింది. అంటే ఒకే నెల(జూన్)లో గత ఏడాదికి, ప్రస్తుత సంవత్సరానికి తేడా సుమారు 26,232 మంది అదనంగా స్వామివారిని దర్శించుకున్నారు. శాతాల పరంగా చూస్తే భక్తుల సంఖ్యలో దాదాపు 10.77 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
సాధారణంగా జూన్ నెలలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో పర్యాటకుల రద్దీ కొంత తగ్గుతుందని భావిస్తారు. అయినప్పటికీ భద్రాద్రి క్షేత్రానికి ఈ స్థాయిలో భక్తులు తరలిరావడం వెనుక మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరిగిన ఆసక్తి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుండి రహదారి రవాణా మెరుగుపడటంతో పాటు, ఆలయ ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న చలువ పందిళ్లు, తాగునీరు, క్యూలైన్ల క్రమబద్ధీకరణ వంటి చర్యలు భక్తులకు సులభతర దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాయి.

