కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో భయానక ప్రమాదం (LPG Tanker Fire) చోటుచేసుకుంది. కాన్పూర్ నుండి వారణాసి వైపు వెళ్తున్న ఒక ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోరి టోల్ ప్లాజా వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుండి గ్యాస్ భారీగా లీక్ అవ్వడం ప్రారంభమైంది. గ్యాస్ క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ వ్యాపించినంత మేర మంటలు ముంచెత్తడంతో ట్యాంకర్ వాహనంతో పాటు టోల్ ప్లాజా ప్రాంగణం మొత్తం మంటలు అంటుకున్నాయి.
ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమవ్వగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకర్ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడం, ఆ వెంటనే మంటలు వ్యాపించడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ట్యాంకర్‌ను మంటలు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైన టోల్ ప్లాజా సిబ్బంది, సమీపంలోని వాహనదారులు, ఇతర డ్రైవర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన జూన్ నెల చివరలో జరిగినప్పటికీ, ప్రమాదం విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

