Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌కు ఎట్టకేలకు ఇండోర్ స్టేడియం.. రూ.5 కోట్లతో నిర్మాణానికి హామీ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు ఎట్టకేలకు ఇండోర్ స్టేడియం రాబోతోంది. రూ. 5 కోట్ల నిధులతో స్టేడియం ఏర్పాటుకు వారం రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేయిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఒలింపిక్ రన్‌లో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో కోచ్‌లు, సరైన క్రీడా మైదానాలు లేకపోయినా జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే వారికి తగిన ప్రోత్సాహం, మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆధునిక స్టేడియాలు, కోచ్‌లను ఏర్పాటు చేసి క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.

వెంటనే స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర క్రీడల మంత్రితో ఫోన్‌లో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, రూ.5 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తామని తెలిపినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అలాగే వారం రోజుల్లో స్టేడియం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ప్రకటనతో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్యతో పాటు రాజ గౌడ్ జావిద్, నాంచారి శీను, వాసు సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>