కలం, నల్లగొండ బ్యూరో : బస్వాపూర్ రిజర్వాయర్ (Baswapur Reservoir) పనులు 98 శాతం పూర్తై ప్రారంభానికి సిద్ధమవుతున్నప్పటికీ, భూ పరిహారంలో వివక్ష, పునరావాసం లేకపోవడంతో నిర్వాసిత దళిత, గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నా కానీ.. పరిహారం చెల్లింపులో రెండు రకాల విధానాలను అధికారులు అమలు చేయడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యారు.
ఒకరికి ఎకరాకు రూ.14 లక్షలు చెల్లిస్తే, మరొకరికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు మాత్రమే నిర్ణయించడం వివాదానికి దారితీసింది. వ్యవసాయం కోల్పోయి, సరైన పునరావాసం లేక వందలాది కుటుంబాలు కూలీలుగా మారాయి. దీంతో బాధితుల ఆవేదనకు, పాలకుల నిర్లక్ష్యానికి బస్వాపూర్ రిజర్వాయర్ నిలువెత్తు నిదర్శనంగా మారింది.
రెండు రకాల పరిహారాలు చెల్లింపు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో బస్వాపూర్ రిజర్వాయర్ (Baswapur Reservoir) (నరసింహస్వామి సాగర్) నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. తొమ్మిదేళ్లలో రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయి. అయితే సర్వం కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. నష్టపరిహారం పూర్తిగా అందక, పునరావాసం లేక జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భూసేకరణ ప్రక్రియలో అధికారులు అనుసరించిన విధానమే నిర్వాసితుల్లో అన్యాయానికి కారణమైంది.
ప్రాజెక్టు ప్రారంభంలో కొందరికి పరస్పర అంగీకార ఒప్పందం (కన్సెంట్ అవార్డు) కింద ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అయితే బీఎన్ తిమ్మాపురం సహా కొన్ని గ్రామాల్లోని సుమారు 1,022 ఎకరాల భూములకు అధికారులు ఏకపక్షంగా ‘ జనరల్ అవార్డు’ ప్రకటించి, ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించారు. ఒకే ప్రాజెక్టు కోసం పక్కపక్కనే ఉన్న భూములను సేకరించినప్పుడు పరిహారంలో వ్యత్యాసం ఎందుకని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ సమానంగా ఎకరాకు రూ.14 లక్షల పరిహారం చొప్పున ఇవ్వాలని తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ, అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఆర్అండ్ఆర్ (పునరావాసం, పునర్నిర్మాణం) ప్యాకేజీ కింద సుమారు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నగదు, ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి ఉంది. 2017లో సర్వే చేసిన సమయంలో మైనర్లుగా ఉన్న అనేక మంది ప్రస్తుతం మేజరై, పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాలుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పాత జాబితా ప్రకారమే పరిహారం అందిస్తామంటున్నారు. దీంతో వందలాది మంది దళిత, గిరిజన యువకులు న్యాయబద్ధమైన హక్కులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కూడా కేవలం కాగితాలకే పరిమితమైందని పేర్కొంటున్నారు.
అర గుంట కూడా రాని పరిస్థితి
భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే అధికారులు భూములను స్వాధీనం చేసుకోవడంతో రైతులు వ్యవసాయం నిలిపివేశారు. అటు పరిహారం అందక, ఇటు సాగు భూములు కోల్పోవడంతో వందలాది కుటుంబాలు కూలీలుగా మారాయి. తొమ్మిదేళ్ల క్రితం ఇవ్వాల్సిన రూ.14 లక్షల పరిహారం ఇప్పుడు ఇచ్చినా, ప్రస్తుత భూముల ధరల ప్రకారం జిల్లాలో కనీసం అర గుంట భూమి కూడా కొనుగోలు చేయలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పాత పరిహారం తీసుకుని తమ జీవితాలు ఎలా కొనసాగించాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
బడ్జెట్ అంచనాలు పెరిగినా..
ఇటీవల బస్వాపూర్ రిజర్వాయర్ (Baswapur Reservoir) అంచనా వ్యయాన్ని రూ.2,670 కోట్లకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో నిర్వాసితుల పునరావాసం కోసం రూ.134 కోట్ల ఆర్అండ్ఆర్ నిధులు కేటాయించినట్లు, వాటిని త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అయితే తొమ్మిదేళ్లుగా ఇలాంటి హామీలే వింటున్నామని నిర్వాసితులు అంటున్నారు. బడ్జెట్ పెంచడం కాదని, తమ బ్యాంకు ఖాతాల్లో పరిహార సొమ్ము జమ అయ్యే వరకు, పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి అప్పగించే వరకు ఎలాంటి హామీలను నమ్మబోమని స్పష్టం చేస్తున్నారు.
పెండింగ్లో ఉన్న రూ.134 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా జనరల్ అవార్డు వివాదాన్ని పరిష్కరించి, అందరికీ సమానంగా పరిహారం, పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

