కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. హనుమకొండ డీఎంహెచ్‌ఓ (Hanumakonda DMHO) డాక్టర్ రాంకుమార్ (Dr Ramkumar) తీరుపై ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటుకు దిగారు. ఆయన వ్యవహార శైలి బాగోలేదని, అమర్యాదగా మాట్లాడుతున్నాడని మహిళా ఉద్యోగులపై వేధింపుల ధోరణి ఉందని పలువురు ఉద్యోగులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లోని కూకట్ పల్లి జోన్ డీఎంహెచ్ఓ చేస్తూ డాక్టర్ రాం కుమార్ గత నెల 8వ తేదీన హనుమకొండకు బదిలీ అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మెడికల్ ఆఫీసర్లు, మహిళా సిబ్బంది, ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన ఓ మహిళా ఉద్యోగిని ఆఫీసుకు పిలిపించి రెండు, మూడు గంటల పాటు వేచి ఉండేలా చేశారని, మరుసటి రోజు కూడా మళ్లీ రావాలని ఆదేశించారని ఆరోపిస్తున్నారు.
ఘటనపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరో మహిళా మెడికల్ ఆఫీసర్‌ను ‘పనిష్మెంట్’ పేరుతో చాలాసేపు నిలబెట్టారని, ఆమెను కూర్చోమని సూచించిన మరో అధికారిపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వారసత్వ నియామకాల ద్వారా వచ్చిన ఉద్యోగులను ‘బిచ్చగాళ్లు’ అంటూ అవమానిస్తున్నారంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో డీఎంహెచ్‌ఓ తీరుపై టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలోని జేఏసీ ప్రతినిధులు హనుమకొండ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఆవేదనను విన్న ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు అందజేశారు. డీఎంహెచ్‌ఓపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాయి.
డ్యూటీ చేయమన్నందుకే.. డీఎంహెచ్ఓ వివరణ
ఉద్యోగ సంఘాల ఆరోపణలపై స్పందించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాం కుమార్ ఖండించారు. “ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించాలని, సమయపాలన పాటించాలని చెబుతున్నాను. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచిస్తే.. కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను” అని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో హనుమకొండ జిల్లా ప్రభుత్వ వైద్య సేవల్లో చివరి స్థానంలో ఉందని పేర్కొంటున్నారు. డీఎంహెచ్ఓ తీరుపై, ఉద్యోగుల ఆరోపణలపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

