Mobile Popup Ad
Mobile Popup Ad

ఒక ఫోన్ కాల్‌తో మొదలై.. ఇప్పుడు దేశానికి చారిత్రక పతకం!

కలం, స్పోర్ట్స్: ఒక ఫోన్ కాల్.. అదే చిరాగ్ యాదవ్ (Chirag Yadav) జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వాలీబాల్‌లో కెరీర్ చేయాలనే ఆలోచన కూడా లేని ఈ హర్యానా యువకుడు, ఇప్పుడు భారత వాలీబాల్ చరిత్రలో నిలిచిపోయే విజయానికి కీలక ఆటగాడిగా మారాడు. ఏవీసీ పురుషుల కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బహ్రెయిన్‌ను 3-1తో ఓడించిన భారత్ తొలిసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో చిరాగ్ 111 పాయింట్లు సాధించి జట్టు విజయానికి ప్రధాన బలంగా నిలిచాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్‌లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబరాలతో మార్మోగింది. అభిమానుల స్పందన అంచనాలను మించిపోయిందని, స్టేడియంలో సీట్లు సరిపోక బయట కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వేచి ఉన్నారని చిరాగ్ తెలిపారు. ఆ మద్దతే తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. చిరాగ్ ప్రయాణం మాత్రం పూర్తిగా అనుకోకుండా మొదలైంది. పదో తరగతి తర్వాత గాంధీనగర్‌లో జరిగిన ట్రయల్స్‌లో సరదాగా పాల్గొన్న ఆయనకు, కొన్ని రోజుల తర్వాత ఎంపికైనట్లు ఫోన్ కాల్ వచ్చింది.

అదే ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. సెమీఫైనల్లో ఓటమి ఎదురైనా జట్టు వెనక్కి తగ్గలేదు. ఆ నిరాశను పక్కనపెట్టి మరుసటి రోజే బహ్రెయిన్‌ను ఓడించి చారిత్రక కాంస్య పతకాన్ని అందుకుంది. ఇప్పుడు జట్టు దృష్టి ఆసియా ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడలపై ఉంది. ఈ విజయం మరింత మంది యువతను వాలీబాల్ వైపు ఆకర్షిస్తుందనే ఆశతో భారత జట్టు కొత్త లక్ష్యాల కోసం సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>