కలం, స్పోర్ట్స్: కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను వణకిస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తుది జట్టులో స్థానం కోసం బెంచ్‌కే పరిమితం కావడం సంచలనంగా మారింది. భారీ హిట్టింగ్‌తో రికార్డులు బద్దలు కొడుతున్న ఈ యువ సంచలనానికి సీనియర్ జట్టు యాజమాన్యం కావాలనే మొగ్గు చూపడం లేదు. టీమిండియాలో ఉన్న ‘సీనియారిటీ క్రమం’ (హైరార్కీ) దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు.
ఒకటి రెండు మ్యాచ్‌ల్లో వారు విఫలమైనా, ప్రపంచకప్ హీరోలకు అండగా నిలవడమే గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ వ్యూహంగా కనిపిస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్రాడి ఫామ్‌ను బట్టి చూస్తే ఐర్లాండ్ మ్యాచ్‌ల్లోనే ఆడించాల్సిందని గవాస్కర్ మండిపడ్డారు. అవకాశం ఆలస్యమైతే కుర్రాడిపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు. మాజీ కోచ్ రవిశాస్త్రి మరింత ఘాటుగా స్పందించారు. ఐర్లాండ్ లాంటి చిన్న మైదానాల్లో వైభవ్ (Vaibhav Sooryavanshi) ఆడి ఉంటే ప్రత్యర్థి బౌలర్ల ప్యాంట్లు ఊడదీసి, బంతిని స్టేడియం పైకప్పు మీదకు బాదేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికైనా అతనికి వెంటనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ మాత్రం వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వంద శాతం సిద్ధంగా ఉన్నాడని అంగీకరిస్తూనే, ప్రపంచకప్ గెలిపించిన సంజూ శాంసన్‌ను కాదనలేమని స్పష్టం చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు జట్టులో భద్రత కల్పించడం ముఖ్యమని, కేవలం ఒకరి కోసం సీనియర్లను పక్కన పెట్టలేమని తేల్చి చెప్పారు.

