కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే రాజాసింగ్ లతో కలిసి పొంగులేటి లబ్ధిదారులకు అందజేశారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
సీఎం రేవంత్ ఆదేశాల మేరకు 3 కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1,000 ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరికొన్ని ఇళ్ల నిర్మాణం చేస్తామని వివరించారు. పేద ప్రజలను సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని అన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌పై ఫైర్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ పై పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే.. కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని చెప్పుకొచ్చారు. అది సాధ్యం కాకపోతే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని విసిరిన సవాల్‌కు బీఆర్ఎస్ నేతల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

