కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సతీమణి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మిభాయిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను తెలంగాణ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ఫెడరేషన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. గ్రూప్-1 స్థాయి అధికారైన లక్ష్మిభాయి కొన్ని సంవత్సరాలుగా మార్కెటింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. హౌజింగ్ శాఖలో అధికారుల కొరత నేపథ్యంలో ఆమెను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
ప్రవీణ్ కుమార్‌పై కక్షతోనే: తలసాని
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నందుకే ఆయన భార్యను వెంటనే బదిలీ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. లక్ష్మిభాయికి మరో ఏడాది మాత్రమే సర్వీస్ ఉందని, ఉన్నఫళంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లూప్ లైన్‌లో కో ఆపరేటివ్ సంస్థకు బదిలీ చేశారని మండిపడ్డారు. గురుకులాల్లో అవినీతిపై ఆధారాలతో ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నందుకే.. ఆయనకు ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు గన్ మెన్లను తొలగించారన్నారు.

