Mobile Popup Ad
Mobile Popup Ad

పని ఇప్పిస్తానని నమ్మించి.. మహిళను బావిలోకి తోసేసి బంగారం చోరి

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించి ఓ వ్యక్తి మహిళ మెడలోని బంగారాన్ని లాక్కొని ఆమెను బావిలోకి తోసేసాడు. చావు అంచుల దాకా వెళ్లిన ఆ మహిళ.. ఏకంగా 24 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడింది.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ​కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. కరీంనగర్ సిటీకి చెందిన ఒక మహిళకు పని ఇప్పిస్తానని నమ్మించిన ఓ వ్యక్తి, ఆమెను నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడ ఆమెపై దాడి చేసి, మెడలో ఉన్న బంగారు గొలుసును దౌర్జన్యంగా లాక్కున్నాడు.

అంతటితో ఆగకుండా, తన నేరం బయటపడకుండా ఉండేందుకు ఆమెను అక్కడే ఉన్న ఒక పాడుబడిన బావిలోకి నెట్టేసి పరారయ్యాడు. ​బావిలో పడిపోయిన ఆ మహిళ సుమారు 24 గంటల పాటు నీటిలో ఊపిరి బిగబట్టుకుని, ప్రాణాల కోసం నరకయాతన అనుభవించింది. మరుసటి రోజు బావి యజమాని అటుగా రావడంతో ఆమె మూలుగులు, కేకలు వినిపించాయి.

వెంటనే అప్రమత్తమైన ఆయన స్థానికులకు సమాచారం అందించారు. ​గ్రామస్తులు తాడుకు మంచాన్ని కట్టి బావిలోకి దించి, అత్యంత చాకచక్యంగా ఆమెను ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఒంటరిగా వెళ్లవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>