కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం డిపో (Bhadrachalam Depot) నుంచి ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వైరా (Wyra) మండలం పినపాక బ్రిడ్జి సమీపంలో బస్సు నడుస్తుండగానే ముందు చక్రాల యాక్సిల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు కుదుపునకు లోనైంది. బస్సు ముందు భాగంలో ఉన్న యాక్సిల్ విరిగిపోవడంతో ఒక వైపు టైరు పూర్తిగా ఊడిపోయి పక్కకు దొర్లిపోయింది. ఆ సమయంలో డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాడు. బస్సు నియంత్రణ కోల్పోకుండా చాకచక్యంగా రోడ్డు పక్కన నిలిపివేయడంతో అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు బ్రిడ్జి సమీపంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పరిశీలించారు. ఫిట్‌నెస్ లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

