కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, కేటుగాళ్లు మాత్రం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరో కల్తీ మటన్ (Adulterated Mutton) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలపడమే కాకుండా, దాన్ని నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తిని ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (H-FAST), స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. మల్లెపల్లిలోని అతని మాంసం దుకాణంపై అకస్మాత్తుగా దాడి చేసిన అధికారులు, అక్కడ నిల్వ ఉంచిన దాదాపు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఆ మాంసం నమూనాలను సేకరించి తదుపరి ల్యాబ్ పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు, హోటల్ ప్రియులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

