కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేత (Warangal CP Swetha)కు సవాళ్లు స్వాగతం పలికాయి. ఇటీవల కమిషనరేట్ లో జరిగిన పరిణామాలు, పోలీసు శాఖపై ప్రజల్లో ఉన్న విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు, శాంతిభద్రతల సమస్యలు.. ఇలా పలు అంశాలు కొత్త సీపీ ఎదుర్కోబోయే పరీక్షలుగా మారాయి. కమిషనరేట్‌లో కీలక అంశం సీఐ, ఎస్‌ఐల పోస్టింగ్‌లు. ప్రతి బదిలీ సమయంలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, ఒత్తిళ్లు సహజం.
ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రతిభ, పనితీరు, నిజాయితీ ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తారా? లేక పాత విధానమే కొనసాగిస్తారా ? అనే చర్చ పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయవర్గాల్లో కూడా జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ లో రియల్ ఎస్టేట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల భూ వివాదాలు కమిషనరేట్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కబ్జాలు, నకిలీ పత్రాలు, రిజిస్ట్రేషన్ గొడవలు, సెటిల్‌మెంట్ల ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తుండగా.. కొన్ని విషయాల్లో పోలీసుల పాత్రపైనా విమర్శలు రావడం శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది.
పోలీస్ సెటిల్‌మెంట్లు, మామూళ్ల వసూళ్లు వంటి ఆరోపణలు కూడా లేకపోలేదు. స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులకు న్యాయం జరగాలంటే పారదర్శక వ్యవస్థ అవసరం. ఫిర్యాదుదారులకే బెదిరింపులు, రాజీ పేరుతో ఒత్తిళ్లు, కేసులతో భయపెట్టడం వంటి ఆరోపణలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వరంగల్ సిటీలో మహిళల భద్రత కూడా ప్రధాన సవాల్ గా మారింది. వేధింపులు, మైనర్లపై అత్యాచారాలు, హత్యలు పోలీస్ శాఖకు ఇబ్బందిగా మారాయి. మరోవైపు పోలీస్ వెల్ఫేర్, విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే సిబ్బందికి సెలవులు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం, ఉత్సాహాన్ని పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
గంజాయి రవాణా, విక్రయాలు
కమిషనరేట్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ రవాణా కూడా ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థలు, యువత టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ విస్తరిస్తోందనే ప్రచారంలో ఉంది. ఆయా ముఠాలపై నిరంతర నిఘా, ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాల్సిన ఉంది. మరోవైపు బెల్ట్ షాపుల నిర్వహణ, అక్రమ మద్యం అమ్మకాలు, రౌడీషీటర్ల ఆగడాలు, భూ కబ్జాలు, వసూళ్లు, బెదిరింపులు వంటివి కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారా..! లేక రాజకీయ ఒత్తిళ్లకు రాజీ పడతారా..! అనేది చూడాల్సి ఉంది.
మున్సిపోల్ పరీక్ష
త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు రానుండగా కమిషనర్ అగ్ని పరీక్ష కానున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ ఘర్షణలు, డబ్బు, మద్యం పంపిణీ, వర్గ పోరు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నియంత్రించడం, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం వంటివి సీపీ సమర్థతకు పరీక్షగా మారనుంది. ఇటీవలి కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై వచ్చిన విమర్శలు, ఫిర్యాదుదారులపై అనుచిత ప్రవర్తన, అవినీతి ఆరోపణలు కూడా శాఖ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వీటిపై కఠినంగా వ్యవహరించి పోలీసింగ్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ముందు ముందు ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచుతుందా..! లేక విమర్శలకు తావిస్తుందా..! అనేది రోజుల్లో తేలనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

