Mobile Popup Ad
Mobile Popup Ad

సీడ్ పత్తి సాగులో ఆర్గనైజర్ల ఇష్టారాజ్యం.. రైతులపై జర్మినేషన్ పేరుతో ధరల కోత

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంటను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాణిజ్య పంట పత్తిని పండించేందుకు రైతులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రైతుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు దళారుల మోసగిస్తున్నారు. రాష్ట్రంలో పత్తి సీడ్ హబ్ గా జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా పేరొందింది. అయితే నేరుగా సీడ్ కంపెనీల యాజమాన్యాలు రైతులను సంప్రదించకుండా ఆర్గనైజర్ల ద్వారా మాత్రమే సాగును ప్రోత్సహించడడంతో వీరి పెత్తనం ఎక్కువైంది. దీంతో చేసేదిమీ లేక ఆర్గనైజర్లు చెప్పినట్టే వింటున్నారు.

గతంలో సీడ్ పత్తి పండించడానికి ఒక్కో రైతుకు ఒక్కో ఎకరాకు రూ. లక్ష అడ్వాన్సుగా ఇచ్చేవారు. ప్రస్తుతం రూ. 50 వేలు మాత్రమే అందిస్తున్నారు. కంపెనీలు నేరుగా రైతులకు చెప్పకుండా మధ్యవర్తుల ద్వారానే చెప్పిస్తున్నాయి. ఏటా జూన్ లో ఫౌండేషన్ సీడ్ ను ఈ ప్రాంత రైతులకు ఆర్గనైజర్ల ద్వారా అందిస్తారు. అప్పటినుంచి పంట చేతికొచ్చే డిసెంబర్ దాకా రైతులకు ఎరువులు, క్రిమి సంహారకాలు ఆర్గనైజర్లు అందిస్తారు. అడ్వాన్స్ గా ఇచ్చిన అమౌంట్, ఎరువులు, క్రిమి సంహారకాల డబ్బులు అప్పుగా ఇస్తుండగా.. పంట చేతికొచ్చే నాటికి ఆర్గనైజర్లకు మిత్తితో చెల్లిస్తారు.

జెర్మినేషన్ తో లింకు

డిసెంబర్ లో పంట చేతికొచ్చే సరికి ఆర్గనైజర్లు రైతుల పంట మొత్తాన్ని సేకరించి జిన్నింగ్ మిల్లుకు పంపిస్తారు. అక్కడ విత్తనాలు, పత్తిని వేరు చేస్తారు. అయితే.. ఆర్గనైజర్లు చెప్పిన రేటుకే పత్తిని ఇవ్వాలి. బహిరంగ మార్కెట్ లో క్వింటాలు 12 వేలు పలికితే, 8 వేలకే ఆర్గనైజర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. విత్తనాల్లో కొన్నింటిని జర్మినేషన్ కు ఒప్పందం చేసుకున్న బడా కంపెనీలకు పంపిస్తారు. ఈ ఫలితాలు రావాలంటే 90 రోజులు ఎదురు చూడాల్సిందే. ఫలితాలు సైతం నేరుగా రైతులకు తెలపకుండా ఆర్గనైజర్ల ద్వారానే తెలుపుతారు.

ఈ ప్రక్రియంతా ప్రైవేట్ సంస్థల్లోనే నిర్వహించడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నప్పటికీ పరిష్కారం కావడంలేదు. బహిరంగ మార్కెట్ లో పత్తి విత్తనాల డిమాండ్ ను బట్టి జర్మినేషన్ తక్కువ వచ్చిందంటూ విత్తనాలను తక్కువకు ధరకు కొనుగోలు చేయడానికి రైతులపై ఆర్గనైజర్లు ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో చేసేదేమి లేక ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఏటా రెండువేల కోట్ల వ్యాపారం

జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి వ్యాపారం ఏటా రెండు వేల కోట్ల వరకు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పత్తి విత్తన రైతులకు (Seed Cotton Farmers) కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కూడా దృష్టి సారించకపోవడంతోనే ఆర్గనైజర్ల చేతుల్లో సీడ్ గ్రోయర్ మోసపోతున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు మండిపడుతున్నారు.

కొన్నేళ్లుగా ఆర్గనైజర్ల మోసాలు మితిమీరి పోతున్నాయని, ఆ కారణంగానే ఎంతోమంది రైతులు పంటపొలాలను తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్లారని రైతు సంఘం నేతలు పేర్కొంటున్నారు. ఆర్గనైజర్ల మోసాలపై కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న హక్కుల సంఘం నేతలు కోర్టులను ఆశ్రయించడంతో ఇప్పటివరకు రూ. 20 కోట్ల మేర నష్టపరిహారం రైతులకు బడా విత్తన కంపెనీల ద్వారా అందించారు. తెలంగాణలో సమగ్ర విత్తన చట్టం లేకపోవడంతోనే దళారుల ఆకృత్యాలకు రైతులు బలవుతున్నారని నడిగడ్డ హక్కుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>