కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో ఉన్న మెగా ఇండస్ట్రీస్ (VS Brand Soya Chunks) తయారీ ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా మానవ వినియోగానికి ఉద్దేశించిన సోయాచంక్స్ (Meal Maker) తయారీలో జంతువుల దాణాగా ఉపయోగించే రఫ్ బ్రాన్ (Rough Bran) కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో ఫ్యాక్టరీలో ఉన్న 755 కిలోల సోయా చంక్స్ తో పాటు తయారీలో వినియోగిస్తున్న 1600 కిలోల రఫ్ బ్రాన్‌ను సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఉత్పత్తుల నుంచి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా సంబంధిత చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్సై శ్రీకాంత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కానిస్టేబుల్ సాయి, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

