కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి వ్యాప్తంగా కార్మిక లోకం మరోసారి పోరు బాట పట్టింది. జేఏసీ (ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం (Kothagudem ) కార్పొరేట్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన మహా ధర్నా, ముట్టడి కార్యక్రమం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సింగరేణిలోని అన్ని ఏరియాల నుంచి వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు భారీగా తరలిరావడంతో కొత్తగూడెం పరిసర ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. “డిమాండ్ల డే”గా నిర్వహించిన ఈ పోరాట కార్యక్రమం సింగరేణి కార్మిక ఐక్యతకు, ఉద్యమ స్ఫూర్తికి మరోసారి నిదర్శనంగా నిలిచింది.
ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల సహనాన్ని బలహీనతగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. వెంటనే 12వ వేజ్ బోర్డును ఏర్పాటు చేసి వేతన సవరణ పూర్తి చేయాలని, అలాగే కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అఖిలపక్ష జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి శ్రమతో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న పాలకులు, అదే కార్మికులకు రావాల్సిన హక్కులను నిరాకరించడం దారుణమని మండిపడ్డారు. శ్రమ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కార్మిక ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే సమ్మెలు, ముట్టడులు, నిరవధిక ఆందోళనలతో ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని దిగివచ్చేలా చేస్తామని హెచ్చరించారు. ఈ మహా ధర్నాలో కార్మిక సంఘాల ముఖ్య నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, జనక్ ప్రసాద్, మంద నర్సింహారావు, కృష్ణ ప్రసాద్‌లతో పాటు పలువురు కేంద్ర, బ్రాంచ్ కమిటీల నాయకులు, వేలాది మంది కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

