కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జూలై నెలాఖరు వరకు ‘పోలీస్ యాక్ట్ 30’ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం తెలిపారు. డివిజనల్ పోలీసు అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, పబ్లిక్ ప్రదేశాల్లో డీజేలు, అధిక శబ్ధం మ్యూజిక్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడవద్దని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ జానకి కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే వ్యాఖ్యలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

