బండి భగీరథ్ బెయిల్ విచారణ వాయిదా!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Bhagirath) దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ బెయిల్ పిటిషన్ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ కె. సుజన నేతృత్వంలోని ధర్మాసనం, తదుపరి విచారణను ఎల్లుండి జులై 3వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి బాధితురాలికి, ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

గతంలో మహీంద్రా యూనివర్సిటీలో తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మల్కాజ్‌గిరిలోని ప్రత్యేక పోక్సో కోర్టు భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన తిరిగి అధికారుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి కేంద్ర కర్మాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ ఉద్దేశాలతోనే తప్పుడు ఆరోపణలు చేశారని, తానేతప్పూ చేయలేదని భగీరథ్ (Bandi Bhagirath) తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించినందున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎల్లుండి జరగబోయే విచారణలో బాధితురాలి తరఫు వివరణ, పోలీసుల నివేదిక ఆధారంగా బెయిల్ అంశంపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>