కలం, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లాలో ఘోర హత్య ఉదంతం వెలుగుచూసింది. మహబూబాబాద్ (Mahabubabad) మండలం సింగారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశారు. మృతుడు యాకయ్య భార్య యశోద కూడా గతంలో మాజీ సర్పంచ్‌గా సేవలందించారు.
ఈ దారుణానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య గత రెండేళ్లుగా గొడవలు, విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో జరిగిన ఈ ఘోర హత్యతో సింగారం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.

