కలం, నల్లగొండ బ్యూరో : ఏటా రికార్డులకెక్కుతున్న పంట దిగుబడులు. అంతకుమించి కన్నీళ్ల కష్టాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటల సాగు (Nalgonda Paddy)లో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి ఇది. సాగునీటి లభ్యత పెరగడంతో ఉమ్మడి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 11 లక్షల ఎకరాలకు చేరింది. మిగిలిన అన్ని పంటల విస్తీర్ణాన్ని కలిపినా, అది వరి సాగులో సగం కూడా ఉండదు.
అయితే ఇప్పుడు రైతులకు వరి సాగు భారంగా మారింది. ప్రతి ఏడాది సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించాలని కేంద్రం సూచనలు చేసినందున ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరం పెరిగింది. కానీ ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులను అటువైపు ప్రోత్సహించడంలో ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవడంలేదు. ఆయిల్ పామ్ మినహా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మార్కెట్ డిమాండ్, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, సాగుకు అనుకూలత వంటి వాటిపై శాస్త్రీయ విశ్లేషణ లేకుండా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తే, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి బాట పట్టి రైతులకు దిశానిర్దేశం చేస్తేనే ప్రత్యామ్నాయ పంటల సాగుపై నమ్మకం పెరుగుతుంది.
వరినే అధికం ..
ఉమ్మడి జిల్లాలో సాగు (Nalgonda Paddy) అంటే వరి అన్నట్లుగా పరిస్థితి ఉంది. అన్ని పంటలు కలిపి 22.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్టు అధికారులు అంచనా. ఇందులో ఒక్క వరి మాత్రమే 11 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది. ప్రతి సీజన్‌లోనూ ధాన్యం 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీని తర్వాత పత్తి 7 లక్షల ఎకరాలకుపైగా సాగు చేస్తుండగా.. మిగతా 2 నుంచి 3 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు కంది, పెసర, మినుములు, మిర్చి, జొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలు వంటివి సాగు చేస్తారు.
ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకే మంచి గుర్తింపు తెచ్చిన బత్తాయి సాగు పూర్తిగా తగ్గిపోయింది. ఐదారేండ్ల కింద 1.50 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయగా.. ప్రస్తుతానికి 50వేల ఎకరాలకు చేరింది. నిమ్మ తోటల పరిస్థితి దాదాపు అంతే. ఒకే పంటను ఎక్కువ కాలం వేయడంతో రైతులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అసలే ఈసారి కరువు పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తుండగా.. మళ్లీ వరి పంటనే నమ్ముకుంటే రైతులకు ఉరి తప్పదనే సంకేతాలు లేకపోలేదు.
రైతు వేదికలు అట్టర్ ప్లాఫ్
రైతులకు ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించి, లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు నడిపించేందుకు ఏర్పాటైన ‘రైతు వేదికలు’ అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. రూ. కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ బోర్డులు, రాజకీయ సమావేశాలకే పరిమితమయ్యాయి. రైతుల్లో కనీస మార్పును కూడా తీసుకురాలేకపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా, రైతులను వరి వదిలి ఇతర పంటల వైపు మళ్లించడంలో పూర్తిగా విఫలం చెందాయనే తీవ్ర విమర్శలూ ఉన్నాయి.
ప్రభుత్వం కాగితాల మీద, ప్రెస్ మీట్లలో ‘ రైతు వేదికల ద్వారా కొత్త కార్యక్రమాలు, అవగాహన సదస్సులు’ అని ఎంతంగా ప్రచారం చేసుకున్నా కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రతి క్లస్టర్‌లోనూ రైతులకు దిశా నిర్దేశం చేయాల్సిన ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు)లు, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడంలేదు. ఏసీ గదులను వీడి బయటకు రాకపోవడంతో రైతు వేదికలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
ఏటా ధాన్యం కొనుగోళ్ల కష్టాలు
ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తున్నప్పటికీ, దాన్ని అమ్మడం రైతులకు కష్టతరంగా మారింది. సీజన్ ముగిసి నెలలు గడుస్తున్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం, తూకాల్లో మోసాలు, మిల్లుల వద్ద కటింగ్ ల పేరిట జరిగే దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నదే తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలేదు. తెలంగాణ నుంచి ఏటా 5 లక్షల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులను అధికారులు మళ్లించడం అత్యవసరంగా మారింది.
ఆఫీసుల్లోంచి బయటకు వెళ్లని అధికారులు
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించేందుకు ఉమ్మడి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు భరోసా ఇవ్సాల్సిందిపోయి, ఆఫీసుల నుంచి బయటకు రావడంలేదు.
ఎప్పుడు మాట్లాడినా కేవలం ఆయిల్ పామ్ సాగు గురించే వివరిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయి భూములకు అనుకూలమైన పంటలపై చెప్పడంలేదు. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు ఉన్నా కానీ, వాటిపై రైతులకు సరైన అవగాహన లేదు. అధికారులు కూడా ఆ దిశగా చొరవ చూపడం లేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రోత్సహిస్తే, జిల్లాలో పండ్ల తోటలతో పాటు డిమాండ్ ఉన్న కూరగాయల సాగు వైపు మళ్లే అవకాశం ఉంది. రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు.
అవగాహన లేకుంటే అప్పుల పాలు
సరైన అవగాహన, మార్కెట్ లింకేజీ లేకుండా కేవలం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సీజన్‌తో సంబంధం లేకుండా రైతులకు సూచిస్తే పంటలు సాగు చేస్తే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ స్పందించాలి. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా లాభసాటి ప్రత్యామ్నాయ పంటలు, వాటి మార్కెటింగ్ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతులను ప్రోత్సహించాలి : మట్టిపల్లి సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
రైతులు ఎక్కువగా నిత్యం వరి, పత్తి సాగు వైపే ఆసక్తి చూపుతారు. అధిక ఖర్చుతో కూడిన వరి, పత్తి, మిర్చి పంటలు వేస్తుంటారు. దీంతో నష్టాలు వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. ఆయా పంటలకు మద్దతు ధర కూడా దక్కడం లేదు. అలా కాకుండా రైతులకు కొత్త వంగడాలు, లాభసాటి పంటల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహిస్తేనే రైతులకు లాభదాయకం. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు ముందుకు వెళ్లాలి.

