కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీల పోడు భూముల (Podu Lands) సాగు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. గతంలో ప్రభుత్వం సాగు చేసుకోవాలని పట్టాలు ఇచ్చిన భూముల్లోకి ఇప్పుడు అటవీ అధికారులు వెళ్లనివ్వడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) సబ్ డివిజన్ పరిధిలోని పలుచోట్ల పోడు భూముల సమస్య మళ్లీ తెరపైకి రావడంతో బాధిత గిరిజనులు భద్రాచలం సబ్ కలెక్టర్ ను ఆశ్రయించారు.
సాగు భూముల్లోకి వెళ్లనివ్వడం లేదంటున్న గిరిజనులు
దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు పంచాయతీ పరిధిలోని గడ్డోరీగట్టు గ్రామానికి చెందిన 23 గిరిజన కుటుంబాలు దశాబ్దాలుగా 27 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నాయి. వారి సాగును గుర్తించిన గత ప్రభుత్వం సర్వే నిర్వహించి ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కుల కింద నంబర్లు కేటాయించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ భూ రికార్డులతో పాటు ఐటీడీఏ కార్యాలయ రికార్డుల్లో ఒక్కో కుటుంబానికి 1.03 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదైందని గిరిజనులు చెబుతున్నారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురిసి సాగు పనులు ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో అటవీ శాఖ అధికారులు తమను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. చట్టబద్ధమైన పత్రాలు చేతిలో ఉన్నప్పటికీ, సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు కంచెలు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేగుంటలో పట్టాల కేటాయింపుపై ఆరోపణలు
చర్ల మండలం కొయ్యూరు గ్రామపంచాయతీ పరిధిలోని రేగుంట పోడు భూముల విషయంలో కూడా వివాదం నెలకొంది. ఇక్కడ తరతరాలుగా సాగు చేస్తున్న 40 మంది గిరిజన కుటుంబాలను పక్కనబెట్టి, అటవీ శాఖలోని కొందరు అధికారులకు లంచాలు ఇచ్చిన వారికి పట్టాలు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములు ఇతరుల పేర్లకు వెళ్లిపోయాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజమైన సాగుదారులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజనులు భద్రాచలం సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను వారం రోజుల్లో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆందోళన తాత్కాలికంగా విరమించినప్పటికీ, మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తమకు చట్టబద్ధంగా కేటాయించిన భూములను కాపాడుకునేందుకు చివరివరకు పోరాడుతామని గిరిజనులు స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పోడు భూముల సమస్య పునరావృతమవుతోందని, ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరతరాలుగా సాగు చేస్తున్న భూముల్లోకి గిరిజనులను వెళ్లనివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆరోపించారు. చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ కేసులు నమోదు చేస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సబ్ కలెక్టర్ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయినప్పటికీ అటవీ శాఖ చర్యలు కొనసాగితే తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చట్టాలు ఉన్నా అమలు కావడం లేదన్న వాదన
గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగంలోని ఐదో, ఆరో షెడ్యూళ్లు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నాయని, పీసా చట్టం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం. అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలు గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు రూపొందించబడ్డాయని పేర్కొంటున్న ఉద్యమకారులు. క్షేత్రస్థాయిలో ఈ చట్టాలు సమర్థంగా అమలు కావడం లేదని, గిరిజనుల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని వారు ఆరోపణలు.

