కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టింది రైతు ఆశీర్వాద సభ కాదని.. రైతు వంచన సభ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15 వేల ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలే ఇస్తున్నారని దుయ్యబట్టారు.
అది కూడా ఒక పంటకు 3 ఎకరాలకు, మరో పంటకు 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చారని, ఒక్కో పంటకు రూ.9 వేల చొప్పున ఎగ్గొట్టారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల ప్రకారం రైతు భరోసా (Rythu Bharosa) పేరిట రైతన్నలకు దాదాపు రూ.30 వేల కోట్లు బాకీ ఉందన్నారు. రైతు భరోసా బకాయిలు దాదాపు రూ.30 వేల కోట్లు ఎప్పుడు, ఎన్ని రోజుల్లో చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి రైతు బంధు ఎగ్గొట్టాడు..
తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీశ్ రావు (Harish Rao) దుయ్యబట్టారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ మళ్ళీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతామని.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రేవంత్ రెడ్డి రైతులను వంచించుతూనే ఉన్నాడని మండిపడ్డారు.
యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్ళీ వానాకాలం రైతు బంధు వేస్తానని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వడ్లకు బోనస్ రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. ఎగొట్టిన రైతు బంధు రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
రైతులకు రైతు డిస్కమ్ ఉరితాడు..
రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7,600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదని గుర్తు చేశారు. 11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతు బంధు కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడని మండిపడ్డారు.
Read Also: యాదగిరిగుట్ట దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటు
Follow Us On : WhatsApp

