కలం, స్పోర్ట్స్: ఫార్ములా-1 జట్టు ఆస్టన్ మార్టిన్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జట్టు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆండీ కౌవెల్ (Andy Cowell) 2026 సీజన్ ముగిసేలోపు జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే జట్టు పేలవ ప్రదర్శనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ వార్త మరింత చర్చకు దారితీసింది. ఆండీ కౌవెల్ 2024లో మెర్సిడెస్ నుంచి ఆస్టన్ మార్టిన్‌లో చేరారు. మొదట గ్రూప్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2025లో టీమ్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు.
అయితే ఆ పదవిలో ఏడాది మాత్రమే కొనసాగి, 2026 నుంచి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా మారారు. కొత్త ఇంజిన్ భాగస్వామి హోండాతో సమన్వయంపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ సీజన్‌లో అడ్రియన్ న్యూవే టీమ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో న్యూవే, కౌవెల్ (Andy Cowell) మధ్య అధికార పోరు జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. ఆ పరిణామాల తర్వాతే కౌవెల్ తన పాత పదవి నుంచి తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన పూర్తిగా జట్టును వీడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ట్రాక్‌పై నిరాశాజనక సీజన్
కొత్త నిబంధనలతో సాగుతున్న 2026 సీజన్‌లో ఆస్టన్ మార్టిన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఎనిమిది రేసుల తర్వాత కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం ఒక్క పాయింట్‌తో పదో స్థానంలో ఉంది. హోండా కొత్త పవర్ యూనిట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కారు అధిక బరువుతో ఉండటం జట్టు సమస్యలను మరింత పెంచాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో భారీ అప్‌గ్రేడ్ ప్యాకేజీ తీసుకురానుంది ఆస్టన్ మార్టిన్. విడివిడిగా మార్పులు చేయకుండా ఒకేసారి పెద్ద ప్యాకేజీ తీసుకురావాలని జట్టు నిర్ణయించింది.
అడ్రియన్ న్యూవే తెలిపిన వివరాల ప్రకారం, రెండు కార్లకూ ఒకేసారి ఈ అప్‌గ్రేడ్ అందించనున్నారు. ఇందులో ప్రధానంగా ఏరోడైనమిక్స్ మెరుగుదల, కారు బరువు తగ్గింపుపై దృష్టి పెట్టారు. బరువును నిబంధనలకు దగ్గరగా తీసుకురావడమే లక్ష్యమని ఆయన వివరించారు. అన్ని అప్‌గ్రేడ్‌లను ఒకేసారి తీసుకురావడం కష్టమైన నిర్ణయమే అయినా, దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ఆ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
Read Also: ఎక్సర్‌సైజ్ చేస్తున్నపుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Follow Us On: Instagram

