కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా (Rythu Bharosa) నిధుల విడుదల సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ అప్పు చేసి ఉండకపోతే రైతులకు ఇంకా మేలు జరిగేదని అన్నారు. అబద్ధాలతో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు రోడ్లమీద తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఖర్చు చేసింది రూ.రెండు లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.లక్షన్నర కోట్లను రైతుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని భట్టి (Bhatti Vikramarka) మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులకే అసలు, వడ్డీ కింద రెండున్నరేళ్లలో రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే కాకుండా ఇప్పుడు కేటీఆర్, హరీశ్ కట్టుకథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
రైతు కంట కన్నీరు చూడకూడదన్నదే తమ ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ రోజు శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2026 వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయడం మనస్సుకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. నేడు 44.28 లక్షల మంది రైతు సోదరుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు నేరుగా జమ చేశామన్నారు. ఎకరానికి రూ.12 వేల చొప్పున అందించే ఈ పెట్టుబడి సాయం పండుగ మరో తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో గత ప్రభుత్వం రైతుల కోసం రూ.2,88,670 కోట్లు ఖర్చు చేస్తే, కేవలం రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.1,56,496 కోట్లు రైతుల సంక్షేమం కోసమే వెచ్చించిందని స్పష్టం చేశారు.
Read Also: రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గేమ్.. సీఎం సభకు వ్యూహాత్మక దూరం!
Follow Us On: Instagram

